అయిజ, వెలుగు: అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది రాకుండా చూస్తామని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. ఇటీవల తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసిన సాగునీరు శుక్రవారం అయిజ మండలం నౌరోజీ క్యాంప్ సమీపంలోని 18 డిస్ట్రిబ్యూటర్ కు చేరుకున్నాయి. ఎమ్మెల్యే రైతులతో కలిసి అక్కడికి చేరుకొని డిస్ట్రిబ్యూటర్ ఓపెన్ చేసి సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యాం నుండి ఏపీ వాటా కింద 2.5 టీఎంసీలు, తెలంగాణ వాటా కింద 1 టీఎంసీ నీళ్లు ఇండెంట్ ద్వారా విడుదల అయ్యాయని తెలిపారు. పంటకాలం పూర్తయ్యేంత వరకు నీళ్లు విడుదల చేసేలా ఇరిగేషన్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. అనంతరం ఉప్పల క్యాంప్‌లోని ఆర్డీఎస్ ఆఫీస్‌లో ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్డీఎస్ ఈఈ సచ్చిదానందనాథ్, ఏఈ రాందాస్, రైతులు పాల్గొన్నారు.