
భూపాలపల్లి (మొగుళ్లపల్లి), వెలుగు : వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకుంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఇండ్లలోకి నీరు చేరడంతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న అంకుశాపురం, ములకలపల్లి, పెద్దకోమటిపల్లి గ్రామాల్లోని బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్వంసమైన రోడ్లు, తెగిన చెరువులు, కుంటలకు, విద్యుత్ రిపేర్లు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన వెంట ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, జడ్పీటీసీ సదయ్య, సర్పంచ్‌ల ఫోరం ప్రెసిడెంట్ అన్నారెడ్డి, సొసైటీ చైర్మన్ నర్సింగరావు, మండల అధ్యక్షుడు తిరుపతిరావు, వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు, ఆర్‌ఐ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.