మంచిర్యాల: క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాకా ఫ్యామిలీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్కొన్నారు. జైపూర్ మండలం కేంద్రంలో నిర్వహించిన వీవీ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి గురువారం (జనవరి 30) ఎమ్మెల్యే వివేక్ బహుమతులు ప్రదానం చేశారు. టోర్నీలో విజేతగా నిలిచిన ఇందారం రన్నర్ కాన్కూర్ జట్టుకు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి సరదాగా ఎమ్మెల్యే వివేక్ క్రికెట్ ఆడారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైపూర్‌లో వీవీ క్రికెట్ టోర్నమెంటును విజయవంతగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా క్రీడలు దోహదపడతాయన్నారు. క్రికెట్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడ అని.. ఇటీవల తాను దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పిల్లలు క్రికెట్ ఆడటం చూశానని.. ఆట పట్ల యువతకు ఉన్న క్రేజ్‌కు ఇదే నిదర్శనమని అన్నారు.
ALSO READ | మంచిర్యాల జిల్లాలో వింత.. బావిలో నుంచి ఐదు రోజులుగా వేడి నీళ్లొస్తున్నయ్..!
మారుమూల ప్రాంతాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు తాము ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నామని చెప్పారు. తన తండ్రి కాకా వెంకటస్వామి ఆదేశాలతో హైదరాబాదులో అన్ని హంగులతో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి స్పాన్సర్ చేశామని గుర్తు చేశారు. విశాఖ, వెలుగు సంస్థల ద్వారా రాష్ట్రస్థాయి పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మా కుటుంబమంతా సిద్ధంగా ఉందని తెలిపారు. యువత చెడు దారి పట్టకుండా నియోజకవర్గంలో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు.