హైదరాబాద్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్యే వివేక్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం ఒక మంచి నాయకుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఆర్థిక కష్టాలలో ఉన్న సమయంలో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టి కొత్త ఆర్థిక విధానాలతో మన దేశ రూపాన్ని మార్చేశారని కొనియాడారు.
మన్మోహన్ హయాంలో దేశ ఆర్థిక వృద్ధి రేట్ కొత్తపుంతలు తొక్కిందని.. ప్రపంచ దేశాలలో జీడీపీ 4 శాతం ఉంటే.. భారత ఆర్థిక వృద్ధి రేట్ 9శాతం ఉందని తెలిపారు. మన్మోహన్ హయాంలోనే రైట్ టూ ఎడ్యుకేషన్, రైట్ టూ ఫుడ్ , రైట్ టూ వర్క్ వంటి కొత్త పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. మా నాన్న కాకా వెంకట్ స్వామి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంచి సన్నిహితులని చెప్పారు.
రూరల్ డెవలప్మెంట్కు నిధులు పెంచాలని మా నాన్న ఎంపీగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విజ్ఞప్తి చేస్తే వెంటనే రూ.25 వేల కోట్ల బడ్జెట్ పెంచారని గుర్తు చేశారు. అప్పట్లో నా విజ్ఞప్తి మేరకు రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ కోసం రూ.10 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసి.. ఎరువుల కర్మాగారం పున: ప్రారంభానికి సహకరించారని తెలిపారు.
మన్మోహన్ హయాంలో చాలా స్కాంలు జరిగాయని ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేసినా... ఏవి నిరూపించబడలేదన్నారు. మన్మోహన్ హయాంలోనే విదేశీ మారక నిలువలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి ఏమికావాలో తెలిసిన ప్రధాని అని కొనియాడారు. మన్మోహన్ సింగ్ సేవలను, ఆయనను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.