మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్

మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‎లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలి రావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్‎లో రామభాయి మాలల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో కలిసి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న మాలలకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు.  మాలల ఆత్మగౌరవం కోసం ఈ సభ పెట్టామని అన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్ దిగ్భందం అయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

మాలలు సింహ గర్జనలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. తాను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుడు తనకు ఎన్నో కార్యక్రమాలకు మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా ) తనకు అండగా నిలిచి, ప్రోత్సహించారని ఆర్ కృష్ణయ్య గుర్తు చేసుకున్నారు. ఆయన కొడుకు వివేక్ వెంకటస్వామి కూడా తండ్రి బాటలో నడుస్తున్నారని.. తన జాతి బాగుకోసం పరితపిస్తున్న వివేక్ వెంకటస్వామికు మాలలు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్య కోరారు .