ఖబర్దార్.. ఈడీ దాడులు జరిగినా వెనక్కి తగ్గేదేలేదు: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: మాలల సింహా గర్జన మీటింగ్‎ను ఎంతో మంది అవహేళన చేశారు.. కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు. మాలల సింహా గర్జన సభకు ఇంత జనం హాజరవుతారని ఎవరూ ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. మన ఆత్మ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలన్న ఎమ్మెల్యే వివేక్.. మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఇవాళ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఆదివారం (డిసెంబర్ 1) హైదరాబాద్‎లోని పరేడ్ గ్రౌండ్స్‏లో పెద్ద ఎత్తున తలపెట్టిన మాలల సింహ గర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. ఈ దేశంలో 3 వేల ఏండ్ల నుంచి కుల వివక్ష కొనసాగుతోందని.. దళితులకు ఫ్రీడం రావాలని అంబేద్కర్ ఆలోచించారని అన్నారు. కుల వివక్ష చూసే అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు కల్పించారని.. కానీ ఇవాళ ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ముందు క్రిమిలేయర్ అంటారు.. ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు . మాలల బలమేమిటో ఈ సభ ద్వారా నిరూపించుకున్నామన్నారు. దళిత సమాజం గురించి అంబేద్కర్ ఆలోచించారు. తన తండ్రి కాకా వెంకటస్వామి దళితుల కోసం పోరాటం చేశారు.. అందులో మాల, మాదిగ చూడలేదు. ఇప్పుడు కాకా అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నానని అన్నారు. 

మాలలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వివేక్.. మాలలపై దుష్ప్రచారం చేస్తే సహించమని హెచ్చరించారు. అంబేద్కర్ ను విమర్శిస్తే మాలలు ఊరుకోరు ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. మాలలు అంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మాలలు తక్కువగా ఉన్నారని ఇన్నాళ్లు భావించారు.. ఈ సభకు వచ్చిన జనమే అలాంటి వాళ్లకు చెంపచెట్టులాంటిదన్నారు. 

రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చిన్నచూపు ఉందని.. అలాంటి రాజకీయ పార్టీలకు చెంపపెట్టు మన ఈ మాల సభ అన్నారు. మంత్రి పదవి కోసం మాలల పోరాటం చేస్తున్నామని కొందరు అంటున్నారు. కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని.. పదవుల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం  చేశారు. గతంలో కేసీఆర్‎కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. ఎన్నో పదవులు ఇస్తాం అంటూ ఆఫర్  వచ్చాయని.. కానీ అన్నింటినీ తృణపాయంగా విడిచి పెట్టానని చెప్పారు. మాలల కోసం పోరాటం చేస్తోన్న తనపై ఈడీ దాడులు చేసిన వెనక్కి తగ్గలేదని తేల్చి చెప్పారు. మీ అందరికి మేము అండగా ఉన్నామని మాలలకు భరోసో కల్పించారు.