మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడా వస్తలేవు ..ఈ స్కీమ్‌‌‌‌లో అవినీతి జరిగింది : ఎమ్మెల్యే వివేక్

  •     ఈ స్కీమ్‌‌‌‌లో అవినీతి జరిగిందని మొదటి నుంచి చెప్తున్నా : చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్
  •     నియోజకవర్గంలో నెలలోగా ఇంటింటికీ నీళ్లు వచ్చేలా ఆఫీసర్లు చర్యలు తీస్కోవాలి
  •     కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు సమస్య తీర్చేందుకు కృషి చేస్త
  •     కరకట్ట నిర్మాణానికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నయని వెల్లడి

కోల్ బెల్ట్, ధర్మపురి, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.61 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం వాటర్ సప్లైలో చాలా లోపాలున్నాయని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి చెప్పారు. ఈ స్కీమ్‌‌‌‌లో అవినీతి జరిగిందని మొదటి నుంచి తాను చెప్తున్నానని అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, జైపూర్, మందమర్రి, కోటపల్లి మండలాల పరిధిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘చెన్నూర్ నియోజకవర్గం పరిధిలో గ్రామాలకు తాగునీటి సప్లై జరుగుతున్నదంటూ.. మిషన్ భగీరథ పనులపై నిర్వహించిన రివ్యూలో అధికారులు రిపోర్టు ఇచ్చారు. కానీ వాస్తవంగా నీళ్లు రావడంలేదు. ఈ రోజు నా పర్యటనలో పలు గ్రామాల్లో ప్రజలు నీటి సమస్య, లీకేజీలు, పైపులు బిగించకపోవడం వంటి ఫిర్యాదులు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని పదే పదే చెప్పింది. కానీ ఎక్కడా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు” అని చెప్పారు. నియోజకవర్గంలో నెల రోజుల్లో ఇంటింటికీ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు.

సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం

సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలని తాను విజ్ఞప్తి చేయడంతో సీఎం రేవంత్​రెడ్డి.. సీఎండీ శ్రీధర్​కు వెంటనే ఆదేశాలు ఇచ్చారని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘తెలంగాణ ఆవిర్భావ సమయంలో సింగరేణిలో 62 వేల మంది సింగరేణి కార్మికులుంటే.. బీఆర్ఎస్ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలతో ఆ సంఖ్య 39 వేలకు తగ్గిపోయింది” అని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 80 శాతం జాబ్స్‌‌‌‌ను స్థానికులు ఇప్పించేలా వచ్చే టెండర్లలో మార్పులు చేస్తారని చెప్పారు.

‘‘ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల కోసం ఒక గంట సేపు కేటాయించే వారు. జనం సమస్యలను తెలుసుకొని పరిష్కారమార్గం చూపించేవారు. ఇప్పుడు సీఎం రేవంత్​రెడ్డి ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు” అని చెప్పారు. క్రిస్టియన్లు, మైనార్టీల సంక్షేమం కోసం సీఎం ప్రత్యేక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నయ్

రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల, చెన్నూర్, మంథని నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో పంటలు ముంపునకుగురవుతున్నాయని, ఇళ్లు కూడా మునిగిపోతున్నాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. మూడేండ్లుగా రైతులు నష్టపోతున్నారని, ముంపు రాకుండా రూ.400 కోట్లతో కరకట్ట నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు నుంచి కాపాడాలని సోమనపల్లి రైతులు కోరడంతో.. వివేక్ వెంటనే ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి కరకట్ట నిర్మాణ విషయాలను అడిగి తెలుసుకున్నారు.

చెన్నూర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తానని వివేక్ చెప్పారు. ఈ నెల 28 నుంచి జరగనున్న గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ మూల రాజిరెడ్డి, అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. 

గత సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది

గత కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని రూ.14 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి వివేక్ దంపతులు, కాంగ్రెస్ యువ నేత వంశీకృష్ణ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధర్మపురి ఆలయాన్ని యాదాద్రి తరహాలో టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తామని వివేక్ చెప్పారు. లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ సర్కార్.. వాటిని ఎక్కడ ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తులు ఎక్కడా పెరగలేదని విమర్శించారు.