కేటీఆర్ సిగ్గుపడాలె.. మీ కుటుంబ ధనదాహం వల్లే మేడిగడ్డ కుంగింది: ఎమ్మెల్యే వివేక్​

  • కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన్రు 
  • లక్ష కోట్లు ఖర్చు పెట్టి 90 వేల ఎకరాలకే నీళ్లిచ్చిన్రు 
  • చెన్నూరు​లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మంచిర్యాల/జైపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్లు దోచుకొని.. మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన కేటీఆర్ సిగ్గుపడాలని చెన్నూరు ​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. కేసీఆర్ ​కుటుంబ ధనదాహం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, అన్నారం బ్యారేజీకి బుంగలు పడ్డాయన్నారు. వారి పర్యటన ప్రజల సొమ్మును ఎట్ల దోచుకున్నారో చూడడానికి వెళ్లినట్టు ఉందని ఫైర్​అయ్యారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. 

శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్​ నియోజకవర్గంలో వివేక్ పర్యటించారు. జైపూర్​ మండలం ఇందారంలో రూ.20 లక్షలతో హెల్త్​ సబ్​ సెంటర్​ నిర్మాణానికి, కాసింపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మందమర్రి ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్​ రూ.35 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టిండు. 

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఆంధ్రా కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనికులను చేసిండు. ఐదేండ్లలో 940 టీఎంసీలు లిఫ్ట్​ చేసి.. 17 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉండె. కానీ, కేవలం 168 టీఎంసీలు లిఫ్ట్​ చేసి మళ్లా గోదావరిలోకి వదిలిపెట్టిన్రు. 90 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చిన్రు' అని వివేక్​ విమర్శించారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల అప్పు చేసి.. ప్రజల నెత్తిన రూ.50వేల కోట్ల వడ్డీ భారం మోపారన్నారు. బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో చెన్నూర్, మంథని నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్న రైతులను నాటి ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. 

భగీరథ, ధరణిలోనూ స్కాములే..

కేసీఆర్​ పాలనలో కాళేశ్వరం, మిషన్​ భగీరథ, ధరణి పోర్టల్​ అన్నింట్లో స్కాములు చేశారని వివేక్ అన్నారు. ‘మిషన్​ భగీరథలో రూ.40 వేల కోట్లు తిన్నరు. పాత ట్యాంకులకు రంగులేసి, పాత పైపులకే కనెక్షన్లు ఇచ్చి అవినీతికి పాల్పడ్డరు. 

గ్రామాల్లో నీళ్లు రాక ప్రజలు గోసపడుతున్నరు’ అని మండిపడ్డారు. ‘ధరణి పోర్టల్​ తీసుకొచ్చి హైదరాబాద్​ చుట్టుపక్కల 20 వేల ఎకరాల భూములు కబ్జా పెట్టిన్రు. రూ.15 లక్షల కోట్ల కుంభకోణం చేసిన్రు’ అని ఆరోపించారు. ఈ స్కాములపై సీబీఐ, ఈడీ ఎంక్వైరీ జరిపి.. కేసీఆర్​ కుటుంబీకులు దోచుకున్న పైసలు కక్కించాలని సీఎం రేవంత్ ​రెడ్డిని కోరినట్టు వివేక్​ చెప్పారు.