మంచిర్యాల: లయన్స్ క్లబ్ గోదావరిఖని వారు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. పేదల కోసం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా మంచి విషయమని కొనియాడారు కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. శనివారం (డిసెంబర్ 7) చెన్నూర్ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ గోదావరిఖని ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్‌కు మా నాన్న కాకా వెంకటస్వామి ఆ రోజుల్లోనే రూ.10 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు.
లయన్స్ క్లబ్ గోదావరిఖని వారు జైపూర్ లెగ్లను అమర్చి పేద వారికి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. డాక్టర్లు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. పేద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చెన్నూర్‌లో రెండు 108 అంబులెన్స్‌లు ప్రారంభించామని.. త్వరలోనే భీమారంకు కూడా ఒక 108 వాహనాన్ని కేటాయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అనంతరం వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.