మాలల సింహగర్జన సభను సక్సెస్‌‌‌‌ చేయండి : వివేక్ వెంకటస్వామి పిలుపు

 మాలల సింహగర్జన సభను సక్సెస్‌‌‌‌ చేయండి : వివేక్ వెంకటస్వామి పిలుపు
  • మహిళలు, యువత, విద్యార్థులు భారీగా తరలిరండి
  • ఖైరతాబాద్‌‌‌‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపు

మెహిదీపట్నం/ఖైరతాబాద్/ముషీరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌లోని పరేడ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించే మాలల సింహగర్జన సభకు భారీగా తరలిరావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని మెహిదీపట్నం, ఖైరతాబాద్‌‌‌‌, సోమాజిగూడ, సికింద్రాబాద్‌‌‌‌ ప్రాంతాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మెహిదీపట్నంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సింహగర్జన వాల్ పోస్టర్ వివేక్‌‌‌‌ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట యాక్షన్ కమిటీ చైర్మన్ మన్నె శ్రీధర్ రావు, రాష్ట్ర కన్వీనర్ పి.బలవంతరావు, వైస్ చైర్మన్లు తాలూకా రాజేశ్‌‌‌‌, గోకుల కళ్యాణ్, క్షత్రి ప్రవీణ్, ఆదర్శ మౌర్య, సుధమల్ల అంజలి తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్‌‌‌‌లోని బడా గణేశ్‌‌‌‌ మండపం వద్ద నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి వివేక్‌‌‌‌ హాజరయ్యారు. శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రాజు వస్తాద్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, వివేక్ సేన పౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి సత్యం, గజ్జెల అజయ్, సామాజిక కార్యకర్త మోహనరావు, బల్వంత్ పాల్గొన్నారు. 

బూత్ స్థాయి నుంచి మాలలు కదిలి రావాలి..

మాలల సింహగర్జనను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని ప్రతి బూత్ స్థాయి నుంచి మాలలు పెద్ద ఎత్తున తరలిరావాలని వివేక్ పిలుపునిచ్చారు. మనకోసమే మహాసభ అని భావించి రావాలని, లేకుంటే మాలలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. 

రాజు వస్తాద్ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆయన నివాసంలో మాల నాయకులు చెన్నయ్య, జంగ శ్రీనివాస్, నరసింహారావు, సర్వయ్యతో కలిసి సింహగర్జన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను వివేక్ ఆవిష్కరించి మాట్లాడారు. మాల మహిళలు, యువత, విద్యార్థులు సికింద్రాబాద్‌‌‌‌ సభకు భారీగా తరలి రావాలని కోరారు. గ్రామాల నుంచి ప్రజలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 

సభ ఏర్పాట్ల పరిశీలన.. 

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించనున్న మాలల సింహగర్జన సభా ఏర్పాట్లను నిర్వాహకులు, ట్రాఫిక్‌‌‌‌ పోలీసులతో కలిసి వివేక్‌‌‌‌ పరిశీలించారు. ఈ సభకు సుమారు 30 లక్షల మంది హాజరుకానున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేయాలని సభ నిర్వాహకులను సూచించారు. సభా వేదిక పనులను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సభ జరిగే రోజు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను కోరారు. 

అంబేద్కర్‌‌‌‌కు అందరు రుణపడి ఉండాలి

జూబ్లీహిల్స్, వెలుగు: బడుగు వర్గాల రక్షణతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని దేశాభివృద్ధి కోసం రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఫిలింనగర్‌‌‌‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే దేశ ప్రజలు ఒప్పుకోరన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే రాజ్యాంగాన్ని రాశారని, ఆయనకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు.