
- జేపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: మన దేశ ప్రజలంతా ఎంతో ఇష్టపడే ఆట క్రికెట్ అని, దాన్ని సరైన పద్ధతుల్లో ప్రమోట్ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జి. వివేక్ వెంకటస్వామి స్పోర్ట్స్ జర్నలిస్టులకు సూచించారు. శనివారం జింఖానా గ్రౌండ్‌లో కేఎస్‌జీ– జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) ఓపెనింగ్, జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమానికి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జేఏటీ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో వెలుగు, వీ6 సహా పది జట్లు పోటీలో నిలిచాయి. చాలా మంది జర్నలిస్టులు ఈ లీగ్‌లో పోటీ పడుతుండటం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. వారికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. క్రమశిక్షణ, సరైన పద్ధతుల్లో ఆడుతూ ముందుకెళ్తే క్రికెట్‌లో క్వాలిటీ పెరుగుతుందని అన్నారు. ఇక తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టి, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అవ్వడానికి వివేక్ ముఖ్య కారణమని జగన్ మోహన్ రావు చెప్పారు.
క్రికెట్, హెచ్‌సీఏ అభివృద్ధికి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ లీగ్‌లో గెలిచిన టీమ్‌కు హెచ్‌సీఏ అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జట్టుతో మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్, జగన్, హెచ్‌సీఏ సీనియర్ మెంబర్ ఆగం రావు, లైఫ్ స్పాన్ స్పోర్ట్స్ హెడ్ భరణి, త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, కేఎస్‌జీ సీఈఓ సంజయ్, స్మైల్ గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్ఈడీ ఫౌండర్ రమేష్‌తో కలిసి కెప్టెన్లకు జెర్సీలు అందజేశారు.