ఎన్​హెచ్​–63 అభివృద్ధికి రూ.100 కోట్లు అడిగినం... వివేక్ వెంకటస్వామి

ఎన్​హెచ్​–63 అభివృద్ధికి రూ.100 కోట్లు అడిగినం... వివేక్ వెంకటస్వామి
  • నాలుగు రోజుల్లో జోడువాగుల వద్ద రోడ్డు రిపేర్లు పూర్తి చేస్తం
  • కాంగ్రెస్ ప్రజాపాలనతో ప్రజలకు మేలు
  • వనమహోత్సవంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ
  • ఎంపీ వంశీకృష్ణతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీని కోరినం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మీదుగా వెళ్లే నిజామాబాద్–-జగ్ధల్​పూర్ నేషనల్ హైవే–63ను మరింత అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్టు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తను.. గడ్కరీని కలిశామని ఆయన కూడా తమ వినతిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు.

అలాగే మరో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్​ను కలిసి ఫారెస్ట్ ప్రాంతాల్లో ఆగిపోయిన రోడ్ల పనులకు అనుమతులు ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. గురువారం కూడా రాష్ట్ర ఫారెస్టు అధికారులను కూడా కలిసి అనుమతులు కోరినట్టు చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. తర్వాత పలు అభివృద్ధి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఎన్​హెచ్–63పై భీమారం మండలం జోడువాగుల వద్ద రోడ్డు రిపేర్లను గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక అధికారులతో మాట్లాడి ఫారెస్టు పర్మిషన్లు వచ్చేలా చేసి, రిపేర్ పనుల కోసం రూ.1.08 కోట్లను శాంక్షన్ చేయించినట్టు చెప్పారు. నాలుగు రోజుల్లో రిపేర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. త్వరలోనే హైవే అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తాను ఎంపీగా ఉన్న టైమ్​లో క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేయించానని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆ బ్రిడ్జి పనులు పూర్తి చేయించలేకపోయిందని విమర్శించారు. తాను మళ్లీ ఎమ్మెల్యే గా వచ్చాక పనులు స్పీడప్​ చేయించానని, నాలుగు నెలల్లో బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందన్నారు.

మిషన్ భగీరథ ఓ ఫెయిల్యూర్ స్కీం..

మిషన్ భగీరథ ఓ ఫెయిల్యూర్ స్కీమ్​అని, చుక్క తాగునీరు రావడంలేదని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. గ్రామాల్లో బోర్లను వేయించి నీటి కొరతను తీర్చామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో పలు చోట్ల టాయిలెట్స్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. చెన్నూరులో మరో కొత్త గురుకులం ఏర్పాటుకు సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడుతానని తెలిపారు.

సర్కార్ ప్రజాపాలనలోనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసిందన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్​రెడ్డి సర్కార్​ కట్టుబడి ఉందన్నారు. రైతులకు పట్టాలిచ్చినా సేద్యం చేసుకోకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ఫారెస్టు ఆఫీసర్లను కలిసి మాట్లాడితే రెవెన్యూ శాఖ తప్పుడు పట్టాలిచ్చిందని చెప్తున్నారని.. దీనిపై రివ్యూ చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.

పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: ఎంపీ వంశీకృష్ణ

పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. విద్యార్థులు బాగా చదువుకునేలా కాకా వెంకటస్వామి ప్రోత్సహించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. చెన్నూరులో ఉన్న ఫారెస్ట్, రోడ్ల సమస్యలపై కేంద్ర మంత్రులతో మాట్లాడి వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ కరెంట్ సప్లై వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో మారుమూల గ్రామాలకు కరెంటు సప్లై లేకుండా పోయిందని.. ఆయా ప్రాంతాలకు కరెంటు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.