మాలల ఆత్మగౌరవం కోసమే కొట్లాడుతున్న: వివేక్‌‌ వెంకటస్వామి

మాలల ఆత్మగౌరవం కోసమే కొట్లాడుతున్న: వివేక్‌‌ వెంకటస్వామి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మాలలు హక్కుల కోసం పోరాడాలని, వారి ఆత్మగౌరవం కోసమే తాను పోరాటం ప్రారంభించానని చెన్నూరు ఎమ్యెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన మాలల ఆత్మగౌర వ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘మా నాన్న కాకా వెంకట స్వామి దళితులకు అండగా ఉండి, వారి హక్కుల కోసం పోరాడారు. ఆయన గర్వంగా నేను దళి తుడినని చెప్పుకునేవారు.

ఈ దేశంలో దళిత కుటుంబంలో పుట్టిన వారు ఎప్పుడూ దళితులుగానే ఉంటారు. ఇలాంటి సమాజంలో ఆర్టికల్ 341లో రిజ ర్వేషన్లను తొలగించాలనే చేస్తున్న ప్రయత్నం సరికాదు. మాలలంతా ఐక్యంగా ఉండాలి. మాలలు ఇతర కులాలను దోచుకున్నది ఎక్కడా లేదు. కొందరు మాలలు దోపిడీదారులు అనే ముద్ర వేస్తున్నారు. మాలల జనాభా తక్కువగా ఉందని చిన్న చూపు చూస్తు న్నారు”అని అన్నారు.

రాష్ట్రంలో మాలల జనాభా 30 లక్షలు ఉందని, అయినా మన జనాభా తక్కువగా ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివేక్‌‌ మండిపడ్డారు. ‘‘మాలలను ఎవరు తిట్టినా ఊరుకోవద్దు. మాలలు నిజాయతీగా బతికే గుణం ఉన్నోళ్లు. మన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఉద్యమించాల్సిన టైమొచ్చింది”అని పేర్కొ న్నారు. జిల్లాల్లో మాలల మీటింగ్‌‌లు సక్సెస్ అవుతుండడంతో వివేక్​ లాంటి నాయకులను వెనక్కి లాగాలని చూస్తున్నారని, అది జరగదన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినప్పుడు తనపై ఈడీ రైడ్స్ జరిగినా తాను వెనక్కి తగ్గలేదన్నారు. మొన్నటి వరకు కేసీఆర్‌‌‌‌పై కూడా కొట్లాడానని చెప్పారు. మాలలకు ఆత్మగౌరవం దక్కే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. మన ఆత్మగౌరవం మనమే తెచ్చుకోవాలని, ఎవరు సహకరించినా, సహకరించకపోయినా ఈ పోరాటం ఆగదన్నారు.

సింహగర్జనను విజయంతం చేయాలి..
డిసెంబర్ 1న సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు. మాలలు త్యాగాలు చేయాల్సిన టైమొచ్చిందన్నారు. మరోవైపు, జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో వివేక్ పాల్గొన్నారు. గ్రామంలోని పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాగులు రాములు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రెంజర్ల రాజేశ్, మాందాల భాస్కర్, కొరివి వేణుగోపాల్, రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలం..
గండిపేట, వెలుగు: మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలని వివేక్ అన్నారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలో మంచిరేవుల గ్రామంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా మాలలపై జరుగుతున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టేందుకు అందరం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తాను మన కులం కోసం పోరాడేందుకు సిద్ధమైన సమయంలో, చాలా మంది సీనియర్ నాయకులు వద్దని వారించారన్నారు. కానీ, తనకు మాల కుల బాంధవులంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారన్నారు.