కాంగ్రెస్ సర్కార్​తోనే అర్హులకు ఇండ్లు : వివేక్​

కాంగ్రెస్ సర్కార్​తోనే  అర్హులకు ఇండ్లు : వివేక్​
  • డబుల్​బెడ్రూం​ ఇండ్ల పేరుతో కేసీఆర్ ​మోసం చేసిండు: వివేక్​
  • కమీషన్లు, సొంత సంపాదన పెంచుకునేందుకు కాళేశ్వరం కట్టిండు
  • 1.25 లక్షల కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిండని ఫైర్
  • చెన్నూరును మోడల్​నియోజకవర్గంగా మారుస్తానని వెల్లడి

కోల్ బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వంలోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చెన్నూరును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో, క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే  వివేక్​ పర్యటించారు. 

సుమారు రూ.90 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రాహుల్ గాంధీ, రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. పదకొండేండ్ల బీఆర్ఎస్​ పాలనలో డబుల్​బెడ్రూంల పేరుతో ప్రజలను కేసీఆర్ నమ్మించి మోసం చేశారని వివేక్​మండిపడ్డారు.

 రూ.70 వేల కోట్లతో రాష్ట్రంలో అర్హులందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే అవకాశమున్నా..​ కమీషన్లు, సొంత సంపాదన కోసం రూ.1.25 లక్షలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు. కేసీఆర్ వందపడకల ఇల్లు కట్టుకొని.. కొడుకు కేటీఆర్, బిడ్డ కవితకు చెరో ఫౌంహౌస్ కట్టించిండన్నారు. చెన్నూరు మండలం పొక్కూరు మోడల్ విలేజ్​లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 300 మంది దరఖాస్తు చేసుకుంటే.. 261 మందికి మంజూరయ్యాయని వివేక్​ తెలిపారు. 

అందులో ఐదు ఇండ్లకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. సర్కార్​ ఇచ్చే  రూ.5లక్షలతో క్వాలిటీతో ఇల్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఆన్​లైన్​ ద్వారా అందించాలని కలెక్టర్​ను ఆదేశించినట్టు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక దందాను పూర్తిగా అడ్డుకున్నట్టు తెలిపారు. పొక్కూర్ గ్రామస్తులు కాకా కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటున్నారని, తనను  ఎంపీగా, ఎమ్మెల్యేగా, తన కొడుకు గడ్డం వంశీకృష్ణను ఎంపీగా భారీ మోజార్టీతో గెలిపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీమ్​కు అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే​సూచించారు. 

ఇఫ్తార్​ విందులో ఎమ్మెల్యే..

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆదివారం రాత్రి క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ ఏజోన్ బిలాల్​ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ముందస్తుగా రంజాన్​ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్​ సర్కార్ కృషి చేస్తోందని, నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి కోసం రూ.70 లక్షల ఫండ్స్​ మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 

ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు..

కాంగ్రెస్ -ప్రజా ప్రభుత్వంలో​అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. తాగునీటి కొరత  ఉన్న చోట విశాక చారిటబుల్ ట్రస్ట్​ ద్వారా బోర్లు వేస్తున్నట్టు  చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్​ సర్కార్ వచ్చిన తర్వాత రాజీవ్​ఆరోగ్యశ్రీ స్కీమ్​ను రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు.

 ఈ సందర్భంగా పొక్కూర్​ గ్రామానికి చెందిన యువతి సంపూర్ణ మాట్లాడుతూ.. తాను అనారోగ్యంతో చావుబతుకుల మధ్య ఉంటే ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి  సీఎం రిలీప్​ఫండ్ అందించి ఆదుకున్నారని తెలిపింది. ఎమ్మెల్యే వల్లే తాను బతికి ఉన్నానని కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని రాంపూర్, సుద్దాల, తుర్కపల్లి, గంగారాం, ఎర్రగుంటపల్లి, కొమ్మేర, పొక్కూర్, చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.