కాళేశ్వరం పైసలతో పేదలందరికీ ఇండ్లు వస్తుండే

కాళేశ్వరం పైసలతో పేదలందరికీ ఇండ్లు వస్తుండే
  • రూ.లక్షా 25 వేల కోట్లు కేసీఆర్ వృథా చేసిండు: వివేక్‌‌ వెంకటస్వామి
  • పేదల సొంతింటి కలను కాంగ్రెస్‌‌ సర్కార్ నిజం చేస్తుందని వెల్లడి
  • మందమర్రి, జైపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్‌‌,  సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రూ.లక్షా 15 వేల కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వృథా చేశారని, ఆ పైసలతో రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే అవకాశం ఉండేదన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, జైపూర్ మండలాల్లో పర్యటించిన వివేక్ వెంకటస్వామి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 

మందమర్రిలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌‌ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి భూమి పూజ చేశారు. మందమర్రి, జైపూర్ మండలం వేలాలలో జరిగిన గ్రామ సభల్లో పాల్గొని, మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా ఈసారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సాగైందని తెలిపారు.

 ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తామని, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లిస్ట్‌‌లో పేర్లు లేవని ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. రైతు భరోసా అమలు కోసం చేస్తున్న ఫీల్డ్ సర్వేలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, సినిమా థియేటర్లు, ఇటుక బట్టీలకు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన విషయాలు బయట పడుతున్నాయని చెప్పారు. 

చెన్నూరులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం ఉదయం మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని ఊరుమందమర్రి ఊరచెరువు వద్ద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండి సదానందం ఆధ్వర్యంలో వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అంతకు ముందు మందమర్రి ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌‌ పనులకు శంకుస్థాపన చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీని ప్రారంభించారు. మందమర్రి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో, జైపూర్ మండలం వేలాలలో జరిగిన గ్రామ సభల్లో పాల్గొని, మాట్లాడారు. 

మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీలోని లేమూరు, గుడిపల్లిని కలిపి కొత్తగా లేమూరు పంచాయతీ చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. జైపూర్ మండలం వేలాల గ్రామంలోని మల్లికార్జున్ స్వామి ఆలయంలో అధికారులతో కలిసి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించే గాంధారీఖిల్లా మైసమ్మ జాతర పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అలాగే, మహా శివరాత్రి సందర్భంగా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లికార్జున్ స్వామి జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో శివరాత్రి జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు, ఆలయ పరిసరాలను పరిశీలించి, భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆధికారులను ఆదేశించారు.