నేతకాని కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేయండి .. సీఎం రేవంత్‌‌ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి విజ్ఞప్తి

  • ఎమ్మెల్యే నేతృత్వంలో సెక్రటేరియెట్‌‌లో సీఎంకు వినతి పత్రం అందించిన సంఘం నేతలు 
  • నేతకాని సామాజికవర్గం సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేతకాని కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి కోరారు. నేత కాని కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌‌లో నేతకాని మహార్ ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో వివేక్ నేతృత్వంలో నేత కాని మహార్ సేవా సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం రాష్ట్రంలో నేతకాని మహార్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 

ఈ మేరకు నేత కాని మహార్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎంపీ మల్లు రవి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నేత కాని మహార్ సేవా సంఘం నాయకులు దుర్గం నరేశ్‌‌, దుర్గం స్వామి, దుర్గం గోపాల్, దుర్గం రాంమూర్తి, సోదారి తిరుపతి, దుర్గం సిద్ధార్థ్ రామ్, నేతకాని మహార్ ఇంటలెక్చువల్ సొసైటీ రాష్ట్ర కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు మసాదే లక్ష్మి నారాయణ ఉన్నారు. 

అనంతరం సెక్రటేరియెట్‌‌ బయట మీడియా సెంటర్‌‌‌‌లో దుర్గం నరేశ్‌‌ మీడియాతో మాట్లాడుతూ.. నేతకాని మహార్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే వివేక్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని మహార్ సామాజిక వర్గానికి ఉన్న సమస్యలు తనకు తెలునని, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ తనను ఎప్పుడు కలిసినా నేతకాని సంక్షేమం గురించి మాట్లాడుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. వివేక్, వినోద్‌‌ల నేతృత్వంలో నేతకాని మహార్ సామాజిక వర్గం సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు, నేతకాని మహార్ ఆత్మగౌరవ భవనానికి స్థలం కేటాయింపుపై సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

మాలల సింహగర్జనకు రండి..

సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో డిసెంబర్ 1న నిర్వహించే మాలల సింహగర్జన సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని మాల ఎమ్మెల్యేలు, ఎంపీ ఆహ్వానించారు. ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి ఆధ్వర్యంలో సెక్రటేరియెట్‌‌లో సీఎంని కలిసి ఈ మేరకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, నాగరాజు, మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.