- మాల జాతికి గౌరవం దక్కే వరకు పోరాడుతూ ఉంటానని వెల్లడి
- వర్గీకరణకు వ్యతిరేకంగా గండిపేటలో నిర్వహించిన సమావేశానికి హాజరు
గండిపేట/మేడిపల్లి, వెలుగు: మాలలంటే చిన్న చూపు చూస్తున్నారని, మనలో ఐకమత్యం చూపించాల్సిన సమయం వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్‌లో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాలల సింహ గర్జన సభను చూసి రాజకీయ పార్టీలకు భయం పుట్టాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని గండిపేట నిర్వహించిన సమావేశానికి వివేక్ ముఖ్యఅథితిగా పాల్గొని, మాట్లారు. ఈ సమావేశానికి తాను రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన రాజు వస్తాద్‌కు మా నాన్న కాకా వెంకటస్వామితో మంచి పరిచయాలు ఉన్నాయని గుర్తుచేశారు.
వర్గీకరణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం తాను వ్యతిరేకించానన్నారు. వర్గీకరణ అంశం సరైన నిర్ణయం కాదని మాల ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని కలిసి చర్చించామని చెప్పారు. మాల జాతి కోసం కాకా చాలా పోరాడారని గుర్తుచేశారు. మాల జాతికి గౌరవం దక్కే వరకు పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మాలల సింహ గర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి 300వ ఆదివారం జ్ఞానమా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి , పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దళితులకు, బీసీలకు రాజ్యాధికారం సాధ్యమైందన్నారు.
సింహ గర్జన సభ ఏర్పాట్లు పరిశీలన
సికింద్రాబాద్, వెలుగు: హక్కుల కోసం మాలలంతా కలిసి పోరాటం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాల జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ‘నౌ ఆర్ నెవర్’అనే విధంగా పోరాటం చేయాలని పేర్కొన్నారు. వచ్చేనెల 1న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మాలల సింహ గర్జన ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను ఆదివారం వివేక్ పరిశీలించారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విజయం సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి పదవులు ఆశించకుండా కొట్లాడానని, ఇప్పుడు కూడా మాలల హక్కుల కోసం కొట్లాడుతున్నానని చెప్పారు. పోరాటం ఏదైనా విజయం సాధించే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద కులం మాలలదే అయినా గుర్తింపు దక్కడం లేదని, దీంతో మన బలం కోసం మాత్రమే కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని కమ్యూనిటీలు ఆత్మగౌరవ సభ జరుపుకుంటున్నప్పుడు మాలలు కూడా జరుపుకొని సత్తా చాటుదామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మాలలు 30 లక్షల మంది ఉన్నారని, అందరూ డిసెంబర్ 1న జరిగే సింహగర్జన సభకు రావాలని కోరారు. మాలలంతా కలిసే ఉన్నారని చెప్పడానికే ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. మరోవైపు, మాలల ఆత్మగౌరవ సభలకి మంచి స్పందన వస్తుందని, జిల్లాలో నడుస్తున్న మాలల ఐక్య వేదిక సభలో, సింహ గర్జన సభను సక్సెస్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారన్నారు.