సింహగర్జనతో మాలల్లో చైతన్యం .. అదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలి: వివేక్ వెంకటస్వామి

సింహగర్జనతో మాలల్లో చైతన్యం .. అదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలి: వివేక్ వెంకటస్వామి
  • ఆవుల బాలనాధంకు ఘనంగా నివాళి

బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ ప్రొటెక్షన్ సొసైటీ ఏర్పాటు చేసి దళితుల కోసం నిరంతరం పోరాటాలు చేసిన మహనీయుడు ఆవుల బాలనాధం అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆవుల బాలనాధం 79వ జయంతి సభ హైదరాబాద్ అబిడ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ వెంకటస్వామి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. తర్వాత మాట్లాడుతూ.. మాలలు ఐక్యంగా ముందుకు సాగాలని బాలనాధం ఆకాంక్షించారని అన్నారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సింహ గర్జన సభ వంటిది నిర్వహించాలని తనతో ఎప్పుడూ అనేవారని, ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. 

సింహ గర్జన సభతో మాలల్లో చైతన్యం వచ్చిందని, ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును ప్రతి ఒక్కరు చదవాలని, అప్పుడే అగ్రకులాల్లో దళితులపై ఉన్న వివక్ష స్పష్టం అవుతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మాలల కంటే మాదిగలే ఎక్కువ నష్టపోతారని, కానీ కొంతమంది దానిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామని.. రాహుల్ గాంధీ ఆకాంక్ష కూడా అదేనని వివేక్ వెంకటస్వామి తెలిపారు. 

ఎస్సీ వర్గీకరణ అంశంపై వచ్చే నెల మొదటి వారంలో మేధావులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని.. మాలలకు అన్యాయం జరగకుండా తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం కిషన్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పకీర్ రఘురాం, ఉపాధ్యక్షులు ఆవుల సుధీర్ కుమార్, గంగ్ హనుమంతు, భుజంగా రావు, ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీరంగా, కార్యదర్శులు ఎన్ బి మోహన్, జి.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.