‘మాలల సింహ గర్జన’తో పొలిటికల్ పార్టీల్లో భయం పుట్టాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: ‘మాలల సింహ గర్జన’కు వచ్చే స్పందన చూసి రాజకీయ పార్టీలకు భయం పట్టుకోవాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. గండిపేట్లో మాలల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్‌‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మాలలంతా ఐకమత్యంగా ఉండాలని, సమాజంలో మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై మాలలు ముసుగులు వేసుకొని కూర్చుంటే నడవదని, అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు తనకు కూడా కేంద్ర పదవి దక్కే అవకాశం ఉన్నప్పటికీ, తనకు కేంద్ర మంత్రి పదవి వద్దని.. తెలంగాణ కోసం కొట్లాడతానని స్పష్టం చెప్పి త్యాగం చేశానని ఎమ్మెల్యే వివేక్ చెప్పారు. అలాగే.. ఇప్పుడు కూడా మాల జాతి కోసం ఎంతవరకైనా పోయి కొట్లాడతానని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ | మాలల సంక్షేమం కోసమే ఉద్యమం...సమాజంలో మాలలకు గౌరవం దక్కడం లేదు:  చెన్నూరు ఎమ్మెల్యే 

బీజేపీలో ఉన్నప్పుడు కూడా తాను ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశానని గుర్తుచేశారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తానంటే వాళ్లు భయపడుతున్నారన్నారు. మాలలు వేర్వేరు సంఘాలు పెట్టుకోవద్దని సూచించారు. అన్ని కులాల వారు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం పెట్టనోళ్లు.. మాలల సమావేశానికి అభ్యంతరం తెలుపుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాలల్లో పట్టుదల పెరగాలని, సమాజంలో మాలలకు గౌరవం పెరిగేంతవరకూ తాను పోరాడుతూనే ఉంటానని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు.