చెన్నూరులో వంశీకి లక్ష మోజార్టీ తీసుకురావాలె : వివేక్​ వెంకటస్వామి

  • రైతుల ధ్యానంలో కోత పెట్టొద్దు
  • ఎమ్మెల్యే వివేక్-సరోజ సమక్షంలో చేరికలు

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు లక్ష పైగా మెజార్టీ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్​ శ్రేణులు సమష్టిగా  కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జైపూర్ ​మండల కేంద్రంలో కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా నిర్వహించిన కార్నర్​మీటింగ్​లో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, సర్కార్​ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని చిత్తశుద్ధితో అమలు చేసిందన్నారు.

రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. కాకా వెంకటస్వామిని విమర్శించే అర్హత బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్​కు లేదన్నారు. కార్యకర్తలు, లీడర్లు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్​పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు సక్రమంగా పనిచేయాలని, రైస్ మిల్లర్లు రైతుల ధాన్యానికి కోత పెట్టి ఇబ్బందులకు గురిచేయొద్దని ఆదేశించారు. 

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంఘం జిల్లా జనరల్​ సెక్రటరీ మల్లెత్తుల నరేశ్ యాదవ్, మందమర్రి, కాసీపేట, బెల్లంపల్లి, మంచిర్యాల మండలాలకు చెందిన 200 మంది యాదవ కులస్తులు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి–సరోజ దంపతుల సమక్షంలో హస్తం గూటికి చేరారు.

మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్​ఎస్ సీనియర్ లీడర్ సంగి సది, జైపూర్ మండల బీజేపీ ప్రెసిడెంట్​ బెద దుర్గాప్రసాద్, జైపూర్​మండల పద్మశాలీ సంఘం ప్రెసిడెంట్​ వేముల మల్లేశ్​తో పాటు పలువురు ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ కార్యక్రమంలో జైపూర్​ మండల కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఫయాజ్, చల్లా సత్యనారాయణరెడ్డి, రిక్కుల శ్రీనివాస్​రెడ్డి, ముక్తి శ్రీనివాస్, మందమర్రి లీడర్లు గుడ్ల రమేశ్, పాషా, తిరుమల్​రెడ్డి, పైడిమల్ల నర్సింగ్, ఓడ్నాల కొమురయ్య, ఎర్రరాజు, అర్జున్​ మహంతో, కిరణ్​తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణం బజార్​ ఏరియాలో ఎమ్మెల్యే వినోద్​తో కలిసి గడ్డం సరోజ ప్రచారం నిర్వహించారు.