మాలల సింహగర్జనను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  • ఆత్మగౌరవ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి
  • సమాజంలో మాలలకు సరైన గౌరవం దక్కట్లేదు
  • సమిష్టిగా పోరాడకపోతే భవిష్యత్ తరాలకు నష్టమని వెల్లడి

రాజాపేట/అంబర్​పేట, వెలుగు: డిసెంబర్ 1న నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాలల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ గర్జన మన దశ దిశ మారుస్తుందని ఇదే మనకు లాస్ట్ చాన్స్ అని పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మాల కులస్తులు, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ రాజు వస్తాద్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అంబర్​పేట్ నల్లకుంట డివిజన్ సత్య నగర్ బస్తీలో జరిగిన సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ.. మాల జాతి చైతన్యం కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానన్నారు. సమాజంలో మాలలకు సరైన గౌరవం దక్కట్లేదని అన్నారు. దీని పోగొట్టాలంటే మనందరం కలిసి సమాజంలోకి వచ్చి మనమేంటో చూపించుకోవాలన్నారు. మనం మన హక్కుల కోసం సమిష్టిగా పోరాడకపోతే భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వారవుతామన్నారు. మాలలపై ఇతర పార్టీలు, వర్గాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. సింహగర్జనకు రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాలల సింహగర్జన పోస్టర్​ను వివేక్​ ఆవిష్కరించారు. సత్య నగర్ బస్తీలో బస్తీలో ఇంటింటికీ మహాగర్జన వాల్ పోస్టర్​ అతికించి.. కరపత్రాలు పంపిణీ వేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. మనకోసం ఎవరో పోరాడుతారని అనుకోకుండా మనమే పోరాడాలని పిలుపునిచ్చారు. గర్జనకు యువకులు ఎక్కువ పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. తుర్కపల్లి జరిగిన కార్యక్రమంలో అరిగే మహిపాల్, లాయర్ సలమల హసన్, మన్నే కృష్ణ, యాదగిరి, దుర్గయ్య.. అంబర్​పేట్​లో జరిగిన కార్యక్రమంలో పోరాట సమితి కో చైర్మన్ జంగ శ్రీనివాస్, బస్తీ అధ్యక్షుడు రామచందర్, భిక్షపతి, రాజేశ్, ప్రభావతి, సునీత పాల్గొన్నారు.