బహుజనుల జ్ఞాన జాతర సక్సెస్ చేయాలి : వివేక్ వెంకటస్వామి

బహుజనుల జ్ఞాన జాతర సక్సెస్ చేయాలి : వివేక్ వెంకటస్వామి
  • జాతరకు ప్రజలు భారీగా తరలిరావాలని వివేక్ వెంకటస్వామి పిలుపు
  • జనవరి 1, 2, 3 తేదీల్లో మంచిర్యాల జిల్లా బోరంపల్లి గ్రామంలో నిర్వహణ
  • ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన చెన్నూరు ఎమ్మెల్యే

కోల్​బెల్ట్, వెలుగు: కుల మత రాజకీయాలకు అతీతంగా బహుజనుల జ్ఞాన జాతరను సక్సెస్ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో జనవరి 1, 2, 3 తేదీల్లో 5వ బహుజనుల జ్ఞాన జాతరను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ప్రచార పోస్టర్లను శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని తన నివాసంలో వివేక్​ వెంకటస్వామి, ప్రముఖ గాయకుడు షాన్ రెంజెర్ల రాజేశ్, జాతర కమిటీ నిర్వాహకులతో కలిసి రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా వివేక్‌‌ మాట్లాడుతూ.. 1818 జనవరి 1న జరిగిన భీమా కోరేగాం యుద్ధంలో విజయం సాధించిన రోజును శౌర్య దివాస్‌‌గా జరుపుకుంటారని, అదే రోజు మహానీయులు సావిత్రిబాయి, -జ్యోతిరావు ఫూలే దంపతులు మొట్టమొదటిసారిగా మహిళల కోసం పాఠశాలను ప్రారంభించి విద్యను ప్రాథమిక హక్కుగా ప్రకటించారని గుర్తుచేశారు. మూడ్రోజుల పాటు జరిగే బహుజుల జ్ఞాన జాతరకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. జాతర నిర్వహకులు మాట్లాడుతూ.. సావిత్రబాయి సమాజాభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకోవడం కోసం బోరంపల్లి గ్రామంలో జాతర నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

జనవరి 1న శౌర్య దివాస్, 2న ఆట పాటలు, 3న సావిత్రాబాయి ఫూలే జయంతి వేడుకలను జరుపుతామని చెప్పారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం సిద్ధార్థ రాంమూర్తి, నేతకాని సేవా సంఘం స్టేట్ లీడర్ జనగామ తిరుపతి, బహుజనుల జ్ఞాన జాతర నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ గోమాస కూడా రాజసమ్ములు, మెంబర్లు జాడి వినీత్, జె.తిరుపతి, దుర్గం దయాకర్, దుర్గం సుష్మా, గోమాస సందీప్ పాల్గొన్నారు.