రుణమాఫీపై ఆందోళన వద్దు... రైతులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా

రుణమాఫీపై ఆందోళన వద్దు... రైతులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా

కోల్ బెల్ట్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయవంతంగా రైతులకు రుణమాఫీ అమలు చేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి, వారికి కూడా స్కీం అందేలా సర్కారు చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. శనివారం చెన్నూరు పట్టణంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రూ.2 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న వాళ్లు ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. వారికి త్వరగా రుణమాఫీ వర్తింపజేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులను నేను, ఎంపీ వంశీకృష్ణ కోరాం.

రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల మేర  క్రాప్ ​లోన్లను మాఫీ చేశాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు’’ అని వివేక్ అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి చెన్నూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.100 కోట్ల ఫండ్స్​తీసుకొచ్చారని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో అటవీశాఖ అనుమతుల్లేక అనేక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. దీనిపై అటవీశాఖ అధికారులతో  సోమవారం చర్చించనున్నట్లు చెప్పారు.

వానాకాలం సీజన్​లో దోమల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీధుల్లో ఫాగింగ్ చేయించాలని కలెక్టర్​ను కోరినట్లు తెలిపారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ జ్వరాల బారిన పడకుండా ఉండాలని కోరారు. చెన్నూరు నియోజకవర్గంలోని 25 ఎకరాల్లో త్వరలో గురుకుల పాఠశాల పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

వాతావరణం సహకరించకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా జరగాల్సిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయని వివేక్ తెలిపారు. అంతకు ముందు జైపూర్ మండల కేంద్రం చేరుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ లీడర్లు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం  చెన్నూరు పట్టణంలోని ఎంఆర్ఆర్ గార్డెన్స్​లో పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే, ఎంపీ సమావేశమయ్యారు.