ప్రజలకు ఉపయోగపడేలా అటవీ చట్టాలను మార్చాలి

ప్రజలకు ఉపయోగపడేలా అటవీ చట్టాలను మార్చాలి
  • అటవీ ప్రాంతాల్లో అభివృద్ధికి చట్టం అడ్డువస్తున్నది: ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి
  • రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ఫారెస్ట్ అధికారులు పర్మిషన్లు ఇస్తలేరని వెల్లడి
  • కోటపల్లి, చెన్నూరు మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల పరిశీలన


కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, అభివృద్ధి పనులు చేద్దామంటే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్లు ఇవ్వడం లేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా అటవీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరు మండలాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంతుంగ వాగు ఉప్పొంగి లింగన్నపేట, ఎదుల్ల బంధం గ్రామాల మధ్య తెగిన రోడ్డు, నక్కలపల్లి, -మల్లంపేట మధ్య కొట్టుకపోయిన లోతు ఒర్రె కల్వర్టు, రాజారాం గ్రామం వద్ద బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, దుబ్బపల్లి రోడ్డు తదితర ప్రాంతాలను ఆర్‌‌‌‌అండ్‌‌బీ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు.

కోటపల్లి మండలంలోని నక్కలపల్లి, రాజారాం, ఎదుల్ల బంధం గ్రామాలకు అటవీ శాఖ అనుమతులు లేక రోడ్లు, వంతెన పనులు నిలిచిపోయాయని అన్నారు. వర్షాకాలానికి ముందే ఫారెస్టు అధికారులతో రివ్యూ నిర్వహించి బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణానికి పర్మిషన్లు అడిగానని చెప్పారు. లోకల్ ఏజెన్సీలు రోడ్లు, తదితర నిర్మాణ పనులు చేపడితే కేంద్ర అటవీ చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించే అవకాశముందని ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారని చెప్పారు.

ఈ పనులకు అడ్డంకిగా మారిన అటవీ చట్టాలను మార్చాలన్నారు. కాగా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌తో వివేక్‌‌ ఫోన్‌‌లో మాట్లాడి, లింగన్నపేట, ఎదుల్ల బంధం గ్రామాల మధ్య తెగిపోయిన రోడ్డు మరమ్మతు చేపట్టాలని కోరారు. లోతుఒర్రె కల్వర్టు పనులకు డీఎంఎఫ్‌‌టీ నిధుల నుంచి రూ.13 లక్షలు వరకు మంజూరు చేయించి రిపేర్లు ప్రారంభిస్తామన్నారు. 

గల్లీలో కాదు ఢిల్లీకి వెళ్లి పర్మిషన్లు తేవాలి 

ఎమ్మెల్యే అటవీ పరిష్మన్లు తీసుకురాలేదని కొందరు బీజేపీ లీడర్లు తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వివేక్ ధ్వజమెత్తారు. తాను మంత్రి పదవి కోసం ఢిల్లీ వెళ్లలేదని, చెన్నూరు అభివృద్ధి కోసమే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినట్టు చెప్పారు. గల్లీల్లో ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేసే బీజేపీ లీడర్లకు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి అటవీ పర్మిషన్లు తీసుకురావాలని  సవాల్ విసిరారు. తాను అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని, డీఎంఎఫ్‌‌టీ ఫండ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.