కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తనని చెప్పి మోసం చేసిండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తనని చెప్పి మోసం చేసిండు :  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ప్రధాని మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారన్నారు.  కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనంలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  త్వరలో  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ ఇస్తామని.. ఇక్కడి యూత్ ఇక్కడే జాబ్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.  మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసం పనిచేస్తుందన్న వివేక్ .. వాళ్లను మోదీ ప్రపంచంలోనే అత్యంత  ధనికులను చేశారని చెప్పారు.  

మోదీ సర్కార్ దేశంలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా పెట్టలేదని..   ప్రైవేట్ సెక్టార్ కే  ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.  దేశంలోని బడా పెట్టుబడిదారులకు మోదీ రూ.16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేశారన్నారు.  కేసీఆర్ రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తే..  మోదీ రూ.125 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు  కానీ సామాన్యులకు ఎలాంటి మేలు జరగలేదని చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. వంశీకృష్ణను మీ సొంత కొడుకు, తమ్ముడు అనుకోని గెలిపించాలని కోరారు.