రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నం

రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నం
  • ప్రజల ఆకాంక్షల మేరకే పాలన: వివేక్ వెంకటస్వామి  
  • ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరుకు సర్కార్ సిద్ధం 
  • మందమర్రి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పర్యటన  

కోల్​బెల్ట్, వెలుగు : రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని చేసి ఎన్నికల్లో ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిలబెట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని, ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసిందన్నారు.

రైతుల మేలు కోసం రుణమాఫీ చేశామని, అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఇంకా మాఫీ కానివారి కోసం మరో రూ.5 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని, వివరాలను పరిశీలించి మాఫీ చేస్తారన్నారు.  మందమర్రి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. వార్డులో డ్రైనేజీ సమస్య తీర్చేందుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయని, దీపక్​నగర్​తదితర వార్డుల్లో రోడ్ల కోసం రూ.86 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

దీంతోపాటు ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు రూ.5 లక్షల చొప్పున ఫండ్స్​ శాంక్షన్ చేశామన్నారు. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఊరుమందమర్రితో పాటు ఇతర వార్డుల్లో డ్రైనేజీల నిర్మాణానికి వారంరోజుల్లో ఎస్టిమేట్స్​సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, నిధులు అవసరమైతే కలెక్టర్​తో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని చెప్పారు. పేదలకు రూ.5 లక్షలతో ఇండ్లు మంజూరు చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. ఎవరైనా భూదందాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​ను ఆదేశించారు.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ  

మందమర్రిలోని సింగరేణి సీఈఆర్ క్లబ్​లో 136 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వివేక్ వెంకటస్వామి, నల్లాల ఓదెలు అందజేశారు. అనంతరం మందమర్రి మున్సిపల్ ఆఫీస్​లో రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను ప్రారంభించారు. బురదగూడెంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు గాంధీనగర్​లో పర్యటించిన ఎమ్మెల్యేను కాలనీవాసులు తాగునీరు, రోడ్ల సౌలత్​లు కల్పించాలని కోరారు.

సింగరేణిలో కాంట్రాక్ట్ లేబర్​గా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్ విధుల నుంచి తొలగించారని, తమను కొనసాగించేలా చూడాలని మహిళా   ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్​తో ఫోన్​లో మాట్లాడి సమస్యను పరిష్కారించాలని వివేక్ సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు.

కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ సతీశ్​కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ సుమతి, ఏఈ అచ్యుత్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నోముల ఉపేందర్ గౌడ్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఊరుమందమర్రికి చెందిన బైరనేని భద్రి, మొదటి జోన్ లో సంకె పోశమ్మ, గాంధీనగర్​లో నల్ల నర్సయ్య కుటుంబాలను వివేక్ వెంకటస్వామి, నల్లాల ఓదెలు పరామర్శించారు.