ఆదిలాబాద్ లో మాలల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. మాలలు అందరూ ఐక్యంగా పని చేయాలని.. మాలల్లో ఉన్న సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అందరు కలిసి ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని అన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే మాలల సత్తా ఏంటో చూపించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఇచ్చిన తీర్పులో చాలా అంశాలు ఉన్నాయని.. తీర్పు పట్ల చాలా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని అన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికీ అనుకూలంగా లేదని.. ప్రశ్నించుకుంటే భవిష్యత్తులో రిజర్వేషన్లకే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఎస్సీల పట్ల ఇంకా వివక్ష ఎందుకు ఉందో అర్థం కాదని.. ఈ వివక్ష పోవాలంటే ఎస్సీల పిల్లలంతా ఉన్నత చదువులు చదవాలని అన్నారు. ఎస్సీ కాలనీలు ఊళ్లకు చివరన ఉంటాయని.. అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ సక్రమంగా ఉండవని.. ఎస్సీ కాలనీల అభివృద్ధికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నానని.. తన సొంత నిధుల్లో 25శాతం వరకు ఎస్సీ కాలనీల అభివృద్ధికే కేటాయిస్తున్నానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.