
- ఎమ్మెల్యే వివేక్ ఫిర్యాదుతో
- కదిలిన యంత్రాంగం
- కరీంనగర్ ఈఈ ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటన
- మురుగునీళ్లు వస్తున్నాయని, వారానికోసారి ఇస్తున్నారని ప్రజల ఏకరువు
- అసంపూర్తి పనులు, పైపులైన్ లీకేజీలు, నిర్వహణ లోపాలను గుర్తించిన అధికారులు
మంచిర్యాల/చెన్నూర్: రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఈ స్కీమ్ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నామని చేసిన ప్రకటనలు ఉత్తమాటలుగా తేలాయి. ప్రస్తుత ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి ఎన్నికలకు ముందు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు, ఆ తర్వాత నియోజకవర్గంలోని ఏ గ్రామంలో, మున్సిపాలిటీలో పర్యటించినా ప్రజలు మిషన్‌భగీరథ నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉన్నతాధికారులు స్పందించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఫీల్డ్‌విజిట్ చేసి పథకం లోపాలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో కరీంనగర్ క్వాలిటీ కంట్రోల్ఈఈ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఈఈలు, ఏఈఈలతో కూడిన ఎనిమిది మంది అధికారులు బృందాలుగా విడిపోయి శుక్రవారం పర్యటించారు. చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలతో పాటు చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండలాల్లోని గ్రామాల్లో విచారణ చేపట్టారు. ప్రజలు విన్నవించిన పలు సమస్యలను రికార్డ్చేసుకున్నారు.
నిర్వహణపై నిర్లక్ష్యం...
అధికారుల పరిశీలనలో మిషన్ భగీరథ పథకం నిర్వహణలో అడుగడుగునా లోపాలు బయటపడ్డాయి. చెన్నూర్మున్సిపాలిటీలో పది ట్యాంకులు ఉండగా ఐదు ట్యాంకుల పరిధిలో ఈఈ కరుణాకర్‌రెడ్డి బృందం పర్యటించింది. ట్యాంకులు, పైపులైన్ల పనులు పూర్తి చేసి ఏడాది పాటు మెయింటనెన్స్చేసిన తర్వాత మున్సిపాలిటీకి అప్పగించాల్సి ఉండగా, ఇప్పటివరకు రెండు ట్యాంకులను మాత్రమే హ్యాండోవర్ చేసినట్టు తెలిసింది. ఒక్క ట్యాంకు పరిధిలోనే సక్రమంగా వాటర్సప్లై జరుగుతుండగా, మిగతా నాలుగు ట్యాంకుల పరిధిలో నీళ్లు సరిగా రావడం లేదని తేలింది.
కొన్ని చోట్ల రెండు రోజులకు ఓసారి, మరికొన్ని చోట్ల వారానికోసారి నీళ్లు ఇస్తున్నారని, లీకేజీలకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోవడంతో మురుగు నీళ్లు వస్తున్నాయని, తాగి రోగాల బారినపడుతున్నామని, లో ప్రెషర్ వల్ల అన్ని ప్రాంతాలకు సప్లై కావడం లేదని ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. పైపులైన్ల లీకేజీలను రిపేర్లు చేయకపోవడం, డ్రైనేజీల్లోంచి పైపులు వేయడం, ట్యాంకులను క్లీన్ చేయకపోవడం వల్లే మురుగునీళ్లు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చాలాచోట్ల నల్లాలు ఊడిపోవడం, వాటర్ ఎప్పుడు రిలీజ్చేస్తున్నారనే సమాచారం ఇవ్వకపోవడం, అసంపూర్తి పనులను పూర్తి చేయకపోవడం వంటి లోపాలను గమనించారు.
బోరు నీళ్లే దిక్కు....
మిషన్ భగీరథ స్కీమ్ఫెయిల్ కావడంతో మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ప్రజలు నేటికీ మంచినీళ్ల కోసం బోర్లపైనే ఆధారపడుతున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీలో ఇలాంటి బోర్లు 120 దాకా నడుస్తున్నాయి. ఒక్కో బోరుకు పది నుంచి పదిహేను కనెక్షన్లు పెట్టుకొని ప్రజలు అవసరాలు తీర్చుకుంటున్నారు. మెజారిటీ గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి ఉన్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. బోరు నీళ్లు తాగలేక చాలామంది ప్రైవేట్వాటర్ ప్లాంట్ల నుంచి బబుల్వాటర్ కొనుక్కొచ్చుకుంటున్నారు. కోటపల్లి మండలంలో కొత్త దేవులవాడలో మూడు ట్యాంకులు నిర్మించినప్పటికీ ఇంటర్నల్పైపులైన్లు, నల్లాల ఏర్పాటు పనులు పూర్తి కాలేదు.
పలుచోట్ల ట్యాంకులు అలంకారప్రాయంగా మిగలడమే కాకుండా పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కోటపల్లి మండలంలో బ్రాహ్మణపల్లి, మల్లంపేట, పారుపల్లి, పిన్నారం, సర్వాయిపేట, దేవులవాడ, రాపన్‌పల్లి, వెల్మపల్లి, కొల్లూరు, చెన్నూర్ మండలంలో కొమ్మెర, రచ్చపల్లి, పొక్కూరు, కత్తెరశాల, శివలింగాపూర్, నారాయణపూర్, భీమారం మండలంలో బూరుగుపల్లి, రెడ్డిపల్లె, కొత్తపల్లి, ఎలికేశ్వరం, దాంపూర్, జైపూర్ మండలంలో కిష్టాపూర్, దొరగారిపల్లి, పెగడపల్లి, ఇందారం, మద్దులపల్లి, మిట్టపల్లి, మందమర్రి మండలంలో బొక్కలగుట్ట, అందుగులపేట, తుర్కపల్లి, చిర్రకుంట, నేతకానివాడ, రంగంపల్లి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆర్కే–4 గడ్డ, కాకతీయ స్కూల్, భగత్ సింగ్ నగర్, రాంనగర్ లలో పర్యటించినట్టు అధికారులు తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా తాము గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్అందజేస్తామని ఈఈ కరుణాకర్‌రెడ్డి తెలియజేశారు.