
- క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం ప్రయారిటీ
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు : క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నదని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో వివేక్ శనివారం మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్‌లో వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్ నిర్మించాలని వాకర్స్ కోరగా.. త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో స్టూడెంట్లకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీసి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, నీటి వసతి సరిగా లేదని, ఫ్యాన్లు తిరగడం లేదని స్టూడెంట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే స్కూల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కారిస్తామని, స్టూడెంట్లు మంచి వాతావరణంలో చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నూరు మండలం సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల కోసం సర్కార్ రూ.5 వేల కోట్లను ఖర్చు చేస్తున్నది” అని తెలిపారు. ఎమ్మెల్యే వెంట చెన్నూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్న సూర్యనారాయణ, స్థానిక లీడర్లు ఉన్నారు.