కేటీఆర్ ఓ పెద్ద తుగ్లక్.. ఆధారాలు లేకుండా ఫాంహౌస్ పై ఆరోపణలు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కచ్చితమైన ఆధారాలు లేకుండా.. తన ఫాంహౌస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మండిపడ్డారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. FTL, బఫర్ జోన్ నిబంధనలకు అనుగుణంగా.. ప్రభుత్వ జీవో ప్రకారమే ఫాంహౌస్ నిర్మాణాలు జరిగాయని.. ఇందులో ఎలాంటి ఆక్రమణలు లేవని స్పష్టం చేశారాయన. విషయం తెలుసుకోకుండా.. తన ఫాంహౌస్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి. 2006లోనే ఆ భూమి కొనుగోలు చేశానని.. బఫర్ జోన్ తర్వాతే నిర్మాణాలు ఉన్నాయని వివరణ ఇచ్చారాయన. 

వీ6 న్యూస్, వెలుగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథలో 46 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. ఆ విషయాన్ని వెలుగు పత్రిక వెలుగులోకి తెచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనూ వేల కోట్ల అవినీతిని సైతం బయటపెట్టింది వీ6 న్యూస్, వెలుగు అన్నారు. ప్రజల పక్షం నిలబడినందుకు.. ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన యాడ్స్ కూడా రాకుండా.. ఇవ్వకుండా అడ్డుకున్నారని.. ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూసినా.. పోరాటం చేసి నిలబడ్డాం అన్నారు వివేక్ వెంకటస్వామి. 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కనీసం చెల్లెలు కవితను గెలిపించుకోలేకపోయాడని.. పదేళ్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఆక్రమణలను ఎందుకు తొలగించలేదని.. ఏం చేశాడని ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనిని స్వాగతించారాయన. 

సినిమా ఇండస్ట్రీ కేటీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. అందుకే అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనిని ప్రజలు హర్షిస్తుంటే.. కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారాయన. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బ్యాన్ పెట్టిందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బద్నాం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ వైఖరిని జనం ముందు ఉంచారు వివేక్ వెంకటస్వామి.

ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. సోషల్ మీడియా ద్వారా బురద జల్లే పనులు మానుకోవాలంటూ కేటీఆర్ కు హితబోధ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.