దళితులను నమ్మించి మోసం చేసిండు .. కేసీఆర్​ను జైలుకు పంపుతం : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

  • లక్ష కోట్ల కాళేశ్వరం పనికి రాకుండా పోయింది
  • కమీషన్ల పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్​ దోచుకున్నడు
  • ​పదవి ఉన్నా లేకున్నా కాకా కుటుంబం ప్రజలకు సేవ చేస్తదని వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ మోసపూరిత పాలన చేసిందని, కేసీఆర్ ​సొంత ఆస్తులను పెంచుకున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల పరిధి గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, మైలారం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేయాలని కోరారు. బీఆర్​ఎస్​ లెక్క కొడుకు, కూతురు, అల్లుడి కోసం కాకుండా కాంగ్రెస్​ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందన్నారు. 

కమీషన్ల కోసం రూ.లక్ష కోట్లు పెట్టి కేసీఆర్ ​కాళేశ్వరం కట్టారని, అది పనికిరాకుండా పోయిందని విమర్శించారు. మిషన్​ భగీరథలో రూ.45 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ధరణి, ఫోన్​ ట్యాపింగ్​ వంటి అక్రమాలకు కేసీఆర్​ కుటుంబం పాల్పడిందన్నారు. లిక్కర్​ స్కామ్​లో కేసీఆర్​ కూతురు  కవిత జైల్లో ఉన్నారని, కేసీఆర్ తోపాటు ఆయన ఫ్యామిలీలో మిగిలిన వాళ్లు కూడా జైలుకు వెళ్తారని చెప్పారు. కేసీఆర్​ డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. ఆయన కొడుకు, కూతురు మాత్రం వందల ఎకరాల్లో ఫామ్​హౌజ్​లు కట్టుకున్నారని ఆరోపించారు.

 తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్​ కనీసం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కాళేశ్వరం కట్టిన ఆంధ్రా కాంట్రాక్టర్​ మేఘా కృష్ణారెడ్డి వంటి వాళ్లే కేసీఆర్ హయాంలో బాగుపడ్డారని తెలిపారు. మూడు లక్షల కోట్లే అప్పు తీసుకున్నానని కేసీఆర్​ చెప్పారని, కానీ ఆయన గద్దె దిగిన తర్వాత ఆ అప్పు ఏడు లక్షల కోట్లుగా బయటపడిందన్నారు. 

కాకా స్ఫూర్తిగా వంశీకృష్ణ  ప్రజాసేవ చేస్తడు

కాకా వెంకటస్వామి స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేసేం దుకే వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారని ఎమ్మెల్యే వివేక్​ అన్నారు. యువకుడైన వంశీకృష్ణ పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండస్ట్రీస్​ తీసుకొచ్చి  ఉద్యోగాలు కల్పించే విజన్​తో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో బెల్లంపల్లి నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పదవిలో ఉన్నా లేకున్నా కాకా కుటుంబం ఎప్పటికీ పెద్దపల్లి పార్లమెంటు ప్రాంత ప్రజలకు సేవలు చేస్తుందన్నారు. 

వంశీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని, ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.  నేతకాని కార్పొరేషన్  ఏర్పాటుకు సీఎం రేవంత్​కట్టుబడి ఉన్నారని, నియోజకవర్గంలో నేతకాని కుల సంఘం భవనాలను నిర్మిస్తామని చెప్పారు. ప్రచారంలో కాంగ్రెస్​ రాష్ట్ర నాయకులు దుర్గం నరేశ్, గట్టు మల్లేశ్, గొల్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు బొమ్మెన హరీశ్​గౌడ్, బెల్లంపల్లి మాజీ మున్సిపల్​ చైర్మన్​ మత్తమురి సూరిబాబు,  నాతారి స్వామి, నర్సింగరావు, తోట శ్రీనివాస్, మల్లిక, జలీల్, గోవింద్​సింగ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు

ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని వివేక్ ​చెప్పారు. ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీని రూ.400కు పెంచుతుందన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్​రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి సర్కారు 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఎన్నికల తర్వాత అర్హులైన పేదలకు ఇండ్లను ఇస్తామన్నారు.

200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, గ్యాస్​ సిలిండర్​ను రూ.500లకే ఇస్తున్నట్టు చెప్పారు. రాజీవ్​ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు రూ.2,500 ఇచ్చేందుకు కాంగ్రెస్​ సర్కార్ సిద్ధమైందని, కేంద్రంలో కాంగ్రెస్​ వస్తే ఆ మొత్తాన్ని రూ.8,500 కు పెంచుతానని రాహుల్​గాంధీ హామీ ఇచ్చినట్టు చెప్పారు. కౌలు రైతులకూ రూ.15 వేలు అందజేస్తామన్నారు.