
- కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాను
- బడ్జెట్‌లో ఎస్సీలకు 18% ఫండ్స్ కేటాయించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశానని వెల్లడి
- ఎస్సీల ఆర్థిక ఎదుగుదలకు ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి
- చెన్నూరు, జైపూర్ మండలాల్లో ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ పాదయాత్ర
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: సింగరేణి చరిత్రలోనే లాభాల నుంచి రూ.5 వేల చొప్పున మొదటిసారి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఒత్కులపల్లి, జైపూర్ మండలం కుందారం గ్రామాల్లో ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు ఇప్పించేందుకు తాను కొట్లాడుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినట్టు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలన్నీ తీర్చి వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
కుందారంలో రూ.15 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని డీఆర్‌డీవో కిషన్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 70 మంది గౌడ కులస్తులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తున్నదని, ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతున్నదని ఆరోపించారు. ఎస్సీలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి చెందుతారని, వీరి కోసం బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కొట్లాడినట్టు గుర్తుచేశారు. ఎస్సీల ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగావకాశాల కోసం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
గౌడన్నలకు అండగా ప్రజా ప్రభుత్వం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో గౌడన్నలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. గీత కార్మికుల రక్షణ కోసం ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈత, తాటి చెట్లు ఎక్కే సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ఈ కిట్లు ఉపయోగపడతాయన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం త్వరలో 20 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుందని తెలిపారు.
కమీషన్లు దండుకోవడానికి బీఆర్‌ఎస్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ఖర్చు చేసిన సొమ్ముతో రాష్ట్రంలో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేవని, గ్రామాల్లో పూర్తిస్థాయి సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించే అవకాశం ఉండేదన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 900 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసినట్టు వెల్లడించారు. రూ.10 వేల కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారని చెప్పారు. విద్యకు రాష్ట్ర సర్కారు ప్రాధాన్యత ఇస్తున్నదని, అధికారంలోకి రాగానే డీఎస్సీ ద్వారా 10 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని చెప్పారు. ఎన్నికల్లో చెప్పినట్టు చెన్నూరు మండలం గొల్లగూడెం నుంచి ఓత్కులపల్లి మధ్య రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్‌ఎస్ ఏఐ గ్రాఫిక్స్‌తో ప్రభుత్వం మీద దుష్ర్పచారం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే చొరవతో సమ్మె విరమించిన కాంట్రాక్ట్ డ్రైవర్లు
తమ వేతనాలు పెంచాలని 13 రోజులుగా సమ్మె చేస్తున్న జైపూర్ మండలం ఇందారం సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్ కాంట్రాక్ట్ వోల్వో డ్రైవర్లు వివేక్ వెంకటస్వామి చొరవతో సమ్మె విరమించారు. గురువారం ఎమ్మెల్యేను డ్రైవర్లు కలిసి, వేతనాల పెంపుపై విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ డ్రైవర్ల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్జీఎం శ్రీనివాస్‌ను ఫోన్‌లో ఆదేశించారు. బేసిక్ వేతనం పెంపుపై హామీ రావడంతో సమ్మె విరమించిన డ్రైవర్లు.. ఎమ్మెల్యే వివేక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ ఆర్మీ కెప్టెన్ నుంచి మేజర్‌గా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా ఆమెను వివేక్ వెంకటస్వామి సన్మానించారు. అంతకు ముందు ఇందారంలో ఎడ్ల పందేలను ఎమ్మెల్యే ప్రారంభించారు. చెన్నూరు మండలం ఒత్కులపల్లి ఎస్సీ కాలనీలో బోరు బావి కోసం భూమి పూజ చేశారు. కొమ్మెర గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సంతోష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.