- దళితులంటే ఆయనకు చిన్నచూపు
- అందుకే వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడ్తున్నడు
- కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే
- ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం
ముషీరాబాద్, వెలుగు: పార్లమెంట్లో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. దళితుల మీద కక్షతోనే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని మండిపడ్డారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన కామెంట్స్‌కు నిరసనగా గురువారం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకటస్వామి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘అమిత్‌షా మాటలను చూస్తుంటే ఆయనకు దళిత కులాల మీద వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వివక్ష పోవాలనే అంబేద్కర్ పోరాటం చేసి ఆత్మగౌరవం కల్పించారు. అలాంటి అంబేద్కర్ పై అమిత్ షా ఇష్టమున్నట్లు మాట్లాడడం ఏమిటి? వెంటనే పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. అభివృద్ధికి దూరంగా ఉన్న దళితులను ఎలా అభివృద్ధి చేయాలి.. ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచన చేయకుండా, మనోభావాలు దెబ్బతీసే విధంగా అమిత్ షా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.