
- కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు: వివేక్ వెంకటస్వామి
- పది మందికి మంచి చేయాలనే కాకా స్ఫూర్తితో ముందుకెళ్తున్నానని వెల్లడి
- రాబోయే రోజుల్లో దళితుడు సీఎం కావాలి: ప్రొఫెసర్ కాశీం
బషీర్బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలు అధికారులుగా ఉన్నత స్థానాల్లో ఉన్నా.. కొంత ఇబ్బందులకు గురవుతుండడం బాధాకరమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్లో తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీంతో కలిసి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
మొదట అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. సమాజంలో మైండ్ సెట్ మారితే కులాల మధ్య విభేదాలు తగ్గించవచ్చన్నారు. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతో పోరాటం చేశారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఏ సమస్యనైనా చాలెంజ్గా తీసుకొని, పరిష్కరించేవారని తెలిపారు. ఇప్పటికి చాలా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీలు ఊరి చివర ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రి కాకా వెంకటస్వామి నుంచి మంచి ఆలోచనతో పది మందికి సహాయం చేయాలనే విషయాన్ని గ్రహించానని, అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నానని చెప్పారు. తాము అంబేద్కర్ విద్యా సంస్థలు స్థాపించి, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డిపార్ట్మెంట్ పరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు.
రాబోయేరోజుల్లో దళితుడు సీఎం అయ్యే చాన్స్
తన కోసం కాకుండా దేశ భవిష్యత్ గురించి ఆలో చించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ప్రొఫెస ర్ కాశీం కొనియాడారు. ప్రపంచం గురించి కార ల్ మార్క్స్ ఆలోచిస్తే.. భారతదేశం గురించి అంబేద్కర్ ఆలోచించేవాడని అన్నారు. తల్లిదండ్రు లు పెట్టిన పేరు భీంరావ్ అని.. భీంరావ్కి ఒక బ్రాహ్మణ టీచర్ అంబేద్కర్ అని పేరు పెట్టారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో దళితులకు సీఎం అయ్యే అవకాశం రాలేదని.. కానీ, రాబోయే రోజుల్లో దళితుడు సీఎం కావాలని ప్రొఫెసర్ కాశీం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసిన ఉద్యోగులకు వివేక్ వెంకటస్వామి ప్రశంసా పత్రాలను అందజేశారు. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భీక్య నాయక్, ప్రధాన కార్యదర్శి నాగేందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.