ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ మోసం చేసిండు : వివేక్ వెంకటస్వామి

  •     కాంగ్రెస్​ పాలనలో ప్రజలకు న్యాయం
  •     రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది 
  •     దేశం బాగుండాలంటే రాహుల్​ గాంధీ ప్రధాని కావాలె
  •     చెన్నూర్ ​రోడ్​ షోలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/చెన్నూరు/లక్షెట్టిపేట/కోటపల్లి, వెలుగు: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్​నమ్మించి మోసం చేశాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి మండిపడ్డారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున చెన్నూరు పట్టణ కేంద్రంలో బుధవారం చేపట్టిన రోడ్​షోలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్​, మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​మూల రాజిరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని జలాల్​ పెట్రోల్​ బంక్ నుంచి గాంధీచౌక్​వరకు జరిగిన రోడ్​షోలో వివేక్​ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మొద్దని, దేశంలో బడుగు, బలహీనవర్గాలు బాగుపడాలంటే రాహుల్​గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు.

రాజ్యాంగాన్ని మార్చడానికే బీజేపీ 400 సీట్లు కావాలంటోందని ఆరోపించారు. గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో కేసీఆర్​ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఫైర్​ అయ్యారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు, మిషన్​భగీరథలో రూ.60వేల కోట్ల కుంభకోణం చేశాడన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ15లక్షలు అకౌంట్​లో జమచేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని అన్నారు. మోదీ, అమిత్​షాలు గుజరాత్​ వ్యాపారులైన అదానీ, అంబానీలను ప్రపంచంలోనే ధనవంతులను చేస్తే.. కేసీఆర్​ఆంధ్రా కాంట్రాక్టర్లను ధనవంతులను చేశారని విమర్శించారు.  ఆగస్టు 15లోపు సీఎం రేవంత్​రెడ్డి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయనున్నట్లు వివేక్ చెప్పారు. కాంగ్రెస్​ సర్కార్​ ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేసిందని, మిగిలిన వాటిని ఎన్నికల కోడ్​ తర్వాత వర్తింపజేస్తుందన్నారు. 

రోడ్డు, నీటి సౌకర్యం కల్పిస్తా..

అంతకుముందు ఎమ్మెల్యే వివేక్ కోటపల్లి మండలం రాజరాం, కావర కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ గ్రామానికి ఏండ్లుగా రోడ్డు సౌకర్యం, తాగునీటి సౌలత్​లు లేవని, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఫారెస్ట్ క్లియరెన్స్​ సమస్య ఉందని, సంబంధిత అధికారులతో చర్చించిన అనంతరం రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కోటపల్లి కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు మహేశ్​తివారి, బ్లాక్ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాజమల్ల గౌడ్, చెన్నూర్​ టౌన్​ ప్రెసిడెంట్​ చెన్న సూర్యనారాయన, బాపాగౌడ్, నేతలు బైసా ప్రభాకర్, గుర్రం రాజన్న, సీతారామిరెడ్డి, చెన్న వెంకటేశ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటపల్లి మండలం లక్ష్మీపూర్​ఋకు​ చెందిన  దొబ్బల సంపత్​ అనే కాంగ్రెస్​ కార్యకర్తను  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి​ పరామర్శించారు.
 
మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం లక్సెట్టిపేట మండలంలోని మోదెల ఊట్కూర్, ఇటిక్యాల గ్రామాల్లో, నస్పూర్​ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో వేర్వేరుగా ప్రచారం చేశారు. వంశీకృష్ణ గెలిస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాడని పేర్కొన్నారు. 

వంశీని గెలిపించాలని విస్తృత ప్రచారం

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని కోటపల్లి మండలం బబ్జెరచెలక, అర్జునగుట్ట, రాపన్​పల్లి, వెల్మపల్లి, దేవులవాడ, రాంపూర్, కొల్లూర్, పారిపెల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, జడ్పీ మాజీ వైస్​ చైర్మన్ ​మూల రాజిరెడ్డి ప్రచారం చేశారు. మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలు, క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపాలిటీల్లో వంశీకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్​ లీడర్లు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల లీడర్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.