అన్నారం బ్యారేజీ కింద ఉన్న పంట పొలాలు మునిగిపోతున్నాయని.. దీని వల్ల వేలాది మంది రైతులు నష్టపోతున్నారంటూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు రైతులు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో.. బీరెల్లి, ముత్తరావుపల్లి, సుందరశాల, నర్సక్కపేట్, దుగ్నపల్లి, వెంకంపేట గ్రామాలకు చెందిన వందల మంది రైతులు..హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు.
అన్నారం బ్యారేజ్ నిర్మాణం వల్ల..ఆయా గ్రామాల్లోని భూములు నీట మునుగుతున్నాయని..పంటలు నాశనం అవుతున్నాయని..రైతులకు వెంటనే న్యాయం చేయాలని మంత్రికి వివరించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సమస్యను సాదరంగా విన్న మంత్రి..పరిష్కారానికి హామీ ఇచ్చారు.
పంట పొలాల్లోకి అన్నారం బ్యారేజ్ నుంచి నీళ్లు రాకుండా.. బ్యారేజ్ చుట్టూ కరకట్ట కట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందు కోసం 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వందల మంది రైతుల సమక్షంలో హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్.
మంత్రి హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ వల్లే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు ఆయా గ్రామాల రైతులు. మంత్రి ఉత్తమ్ కు, ఎమ్మెల్యే వివేక్ కు రుణపడి ఉంటామన్నారు రైతులు.