సన్నబియ్యం.. పేదలకు వరం .. ఇచ్చిన మాట ప్రకారం పంపిణీ చేస్తున్నం: వివేక్​ వెంకటస్వామి

సన్నబియ్యం.. పేదలకు వరం .. ఇచ్చిన మాట ప్రకారం పంపిణీ చేస్తున్నం: వివేక్​ వెంకటస్వామి
  • దేశంలో ఎక్కడా ఈ స్కీం లేదు 
  • బీఆర్ఎస్ హయాంలో​ రేషన్ బియ్యం​మాఫియా నడిచిందని కామెంట్
  • కిష్టంపేటలో సన్నబియ్యంతో వండిన అన్నం తిన్న ఎమ్మెల్యే, కలెక్టర్​

కోల్​బెల్ట్/కోటపల్లి/చెన్నూరు/పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పేదలకు వరమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్​ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. చెన్నూరు మండలం కిష్టంపేటలో సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి నేతృత్వంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్​ సర్కార్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదన్నారు. సన్నబియ్యం బాగలేవని కొందరు సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే మంచి స్కీంల పట్ల ప్రతిపక్షాలు ఆలోచించాలన్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పంపిణీతో రేషన్​ మాఫియా కొనసాగిందని ఆరోపించారు. పేదల​ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలివెళ్లాయన్నారు. సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వివేక్​ అన్నారు. 

ఆరు గ్యారంటీలు వర్తించని అర్హుల వివరాలను సేకరించి సంబంధిత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్​ శ్రేణులపై ఉందన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తున్నామని, వీలయినంత వరకు బోర్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు.  చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండల పరిధి అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో  చేపట్టే అభివృద్ది పనులకు అవసరమైన పర్మిషన్ల కోసం దానికి సమానంగా మరో చోట భూమిని కొనుగోలు చేసి ఫారెస్ట్​ శాఖకు అప్పగించేందుకు  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  

సన్నబియ్యంతో భోజనం చాలా రుచిగా ఉంది..​

సన్నబియ్యంతో వండిన భోజనం చాలా రుచిగా ఉందని ఎమ్మెల్యే వివేక్​అన్నారు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేసిన అనంతరం మధ్యాహ్నం సన్నబియ్యంతో చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, మంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్.. గ్రామస్తులతో కలిసి తిన్నారు. సన్నబియ్యంపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తగదన్నారు. అనంతరం కోటపల్లి మండలం బొప్పారం మోడల్​ విలేజ్​లో ఐదు ఇండ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. 

నక్కలపెల్లి గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి.. కోటపల్లిలో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఇతర చెక్కులు అందజేశారు. ఆ తర్వాత చెన్నూరు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ‘జై బాపు.. జై భీం.. జై సంవిధాన్’​లో భాగంగా  నిర్వహించిన రాజ్యాంగపరిరక్షణ పాదయాత్రలో  ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, జిల్లా​ కో ఆర్డినేటర్ అంజన్​కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి  కాంగ్రెస్​ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు.

నేటి యువత జగ్జీవన్​ రామ్ అడుగు జాడల్లో నడవాలి

బాబూ జగ్జీవన్​ రామ్ దళితుల అభ్యున్నతికి జీవితాంతం ఎనలేని కృషి చేశారని, నేటి యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ ​రామ్​ 118వ జయంతి వేడులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ హాజరై.. జగ్జీవన్​రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘సామాజిక సమానత్వం, కుల రహిత సమాజం కోసం జగ్జీవన్​రామ్​తన జీవితాన్ని అర్పించారు. 

దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆయన ఆశయాలు నిజం చేసే విధంగా పనిచేస్తున్నది. సీఎం రేవంత్​రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా దిశ కమిటీ మెంబర్, సీనియర్​ కాంగ్రెస్​ లీడర్​ సయ్యద్​ సజ్జాద్, బండారి సునీల్, బాలసాని సతీశ్, గంగుల సంతోష్​, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.