మాలల్లో ఐక్యత వచ్చింది.. సింహ గర్జన విజయవంతం చేయాలె: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సికింద్రాబాద్: మాలల్లో ఐక్యత వచ్చిందని, పరేడ్ గ్రౌండ్స్లో డిసెంబర్ 1న జరగబోయే ‘సింహ గర్జన’ను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. డిసెంబర్ 1న జరగనున్న ‘సింహ గర్జన’ మీటింగ్ ఏర్పాట్లు పరిశీలించామని, డిఫెన్స్, పోలీసులు, ట్రాఫిక్ అనుమతులు తీసుకున్నామని పరేడ్ గ్రౌండ్స్ పరిశీలించిన అనంతరం ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. మాలల్లో ఐక్యత వచ్చిందని, ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న రెండో పెద్ద కులం మాల అని, ‘మాలల ఐక్య వేదిక’ ఎందుకని కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. అన్ని కులాల వారికి ‘మాలల ఐక్యత- మాలల సత్తా’ చూపించాలని కోరుతున్నానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్‌‌లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా.. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మెన్ జ్యుడీషియల్ కమిషన్ వర్క్ షురూ చేసింది. ఈ నెల 11న బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల వర్గీకరణపై ఎస్సీ నేతలు, సంఘాలు, మేధావులు, పార్టీలు, నేతలు తమ అభిప్రాయాలను కమిషన్కు అఫిడవిట్ల రూపంలో అందజేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు. 

సామాజిక, ఆర్థిక వెనుకబాటు, ప్రభుత్వ ఉద్యోగాలు, చదువులలో రిజర్వేషన్లు పొందిన వారిని గుర్తించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 రోజుల్లో వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.