సింహగర్జనతో సత్తా చూపిస్తం...మాలల్లో ఐక్యత వచ్చింది: వివేక్ వెంకటస్వామి 

  • మాలల ఐక్యవేదిక ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నరని ఫైర్
  • పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాట్ల పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: మాలల్లో ఐక్యత వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సింహగర్జన సభతో మాలల ఐక్యత, సత్తా చూపిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చే నెల 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న “హలో మాల చలో హైదరాబాద్.. మాలల సింహగర్జన”ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం పరేడ్ గ్రౌండ్ లో సభ ఏర్పాట్లను మాల మహానాడు నేతలు చెన్నయ్య, రాంచందర్, వెంకటేశ్వర్లు, రంజిత్, భాస్కర్, రవితో కలిసి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు.

అంతకుముందు సింహగర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామిని నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద కులం ఇదే. మాలల ఐక్య వేదిక ఎందుకని పార్టీల నేతలు అంటున్నారు. ఈ సింహగర్జన ద్వారా మా సత్తా చూపిస్తాం. సభకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి లక్షలాది మంది తరలివచ్చి సభను సక్సెస్ చేయాలి” అని పిలుపునిచ్చారు. గతంలో ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడూ జరగలేదన్నారు. 

Also Read : రామగుండంలో ఎయిర్​పోర్ట్ ఏర్పాటు చేయండి

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నరు: చెన్నయ్య 

సభకు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాలలు వస్తున్నారని మాల మహానాడు నేషనల్​ ప్రెసిడెంట్ చెన్నయ్య తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది మాలలు సింహగర్జన సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు నేత రాంచందర్ అన్నారు.

మాలలు తక్కువ ఉన్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సభతో వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ మీటింగ్ ను సక్సెస్ చేయాలని భీం మిషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్, ఓయూ జేఏసీ నేత భాస్కర్ పిలుపునిచ్చారు. ‘‘సింహగర్జన ద్వారా పార్టీలకు బుద్ధి చెబుతాం. మా వాటా మాకు వచ్చేలా పోరాడుతాం” అని చెప్పారు.