
హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే వైద్యం చెన్నూరులో అందుబాటులో ఉంచుతానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షల పథకంను ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలన్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు సిబ్బంది ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఎమ్మెల్యే వివేక్ అడిగితే జిల్లా అధికారులు నోరెళ్లబెట్టారు. దీంతో చెన్నూరులో కావాల్సిన డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడుతానని చెప్పారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది వైద్యం చేసుకున్నారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. కొవిడ్ రోగులకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ను కోరినా ఆయన పట్టించుకోలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పేదలకు మేలు జరుగుతుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో బ్యాక్ వాటర్ తో ముంపు అంశం కూడా చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని చెప్పారు. చెన్నూరు సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. సింగరేణి అభివృద్ధి కోసం స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్నారు. సింగరేణి కాంట్రాక్టర్ల తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు వివేక్ వెంకటస్వామి.గత ప్రభుత్వ హయాంలో పని చేసినట్టుగా అధికారులు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. చట్టానికి, నిబంధనలకు లోబడి అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఉదయం ఆరు గంటల నుంచే చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు వివేక్ వెంకటస్వామి.