కర్నాటక రాష్ట్రంలో జరిగిన వాల్మీకి స్కాంతో అసలు సంబంధమే లేదని.. వీ6 బిజినెస్ సొల్యూషన్ కంపెనీ ఎవరిదో కూడా తెలియదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వీ6 బిజినెస్ సొల్యూషన్ అనేది బెంగళూరులోని హంపినగర్ లో రిజిస్ట్రర్ అయ్యి ఉందని.. వీ6 న్యూస్, వెలుగు పత్రికలతో సంబంధం లేకపోయినా.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.
వీ6 బిజినెస్ సొల్యూషన్ తో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తావా.. దేనికైనా రెడీ అంటూ మీడియా ముఖంగానే కేటీఆర్ కు ఛాలెంజ్ చేశారు వివేక్ వెంకటస్వామి. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తు్న్నాడంటూ కేటీఆర్ పై మండిపడ్డారాయన.
2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి వీ6 న్యూస్, వెలుగు పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించటం జరుగుతూనే ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించటం.. ప్రజల పక్షాన నిలబడిన మా మీడియాను అణగదొక్కాలనే కుట్ర చేశారని.. మా వ్యాపారాలపైనా దాడులు చేసినా.. ఏ విధంగానూ నిరూపించలేకపోయారని స్పష్టం చేశారాయన.
బీఆర్ఎస్ పాలన అంతా ప్రజా సొమ్మును దోచుకుని తిన్నారని.. కేసీఆర్, కేటీఆర్, కవిత వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందు వల్లనే.. అసలు సంబంధమే లేని వాల్మీకి స్కాంలోనే వీ6 న్యూస్, పేపర్ తోపాటు తన పేరుతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నాడని.. దీని వెనక కేటీఆర్ ఉన్నాడని స్పష్టం చేశారు వివేక్ వెంకటస్వామి.
వీ6 బిజినెస్ సొల్యూషన్ తో సంబంధం లేదని.. దేనికైనా రెడీ అంటూ కేటీఆర్ ను ఓపెన్ ఛాలెంజ్ చేశారు వివేక్ వెంకటస్వామి.