
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా..? లేదా..? అని ఎమ్మెల్యే వివేక్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే.. నీళ్లు రావడం లేదని మహిళలు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని పదే పదే చెప్పింది గానీ.. ఎక్కడా మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేదని, ఇదే విషయాన్ని ప్రజలు కూడా తమకు చెబుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే వివేక్.
చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. అవినీతి, అక్రమాలు చేయకుండా అధికారులు బాగా పని చేయాలని చెప్పారు. 10 రోజుల తరువాత అధికారులతో సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.