
- రూ.40 కోట్లతో చెన్నూరు నియోజకవర్గానికి తాగు నీటి సౌకర్యం: వివేక్ వెంకటస్వామి
- అమృత్ 2.0 స్కీం ద్వారా పనులు స్టార్ట్ చేశామని వెల్లడి
- ఈ ఉగాదిలో అందరికీ శుభం కలగాలని ఆకాంక్ష
- చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో పంచాంగ శ్రవణం
కోల్ బెల్ట్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. గోదావరి నది నుంచి చెన్నూరు ప్రజలకు తాగు నీరు అందించేందుకు రూ.40 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందులో భాగంగా అమృత్ 2.0 స్కీం ద్వారా పనులు ప్రారంభించామని వెల్లడించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, మందమర్రి మండలాల్లో ఆయన పర్యటించారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.
అనంతరం వివేక్ మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఈ ఏడాది 150 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని, ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి 2 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరానని, ఈ విషయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని తెలిపారు.
అప్పులపై కేసీఆర్ అబద్ధం చెప్పిండు..
రాష్ట్ర అప్పు రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే ఉందని మాజీ సీఎం కేసీఆర్ అబద్ధం చెప్పారని, వాస్తవంగా రూ.7.5 లక్షల కోట్లు ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల సమయంలో నిధులు లేకున్నా రూ.కోట్లలో పనులు సాంక్షన్ చేసి ప్రజలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ ఉన్నా.. ప్రజల కోసం సంక్షేమ పథకాలను కాంగ్రస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. చెన్నూరులో అత్యధికంగా ఎల్‌వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చామని గుర్తుచేశారు. మిషన్ భగీరథ పథకం ఒక ఫెల్యూర్ స్కీమ్ అని ఆరోపించారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడి రాకుండా బోర్ వెల్స్ వేయించామన్నారు. ఇక్కడ చాలా చోట్ల రోడ్లు కూడా వేశామన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాలేదని, మన నియోజకవర్గంలోని సోమనపల్లి గ్రామంలో మాత్రం మంజూరైందన్నారు.
చెన్నూరులో విద్యా సంస్థల్లో లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని పలుచోట్ల ఫారెస్ట్ అనుమతులు రాక చాలా బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలు జరగలేదన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. చెన్నూరు బైపాస్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించి ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పట్టణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నామని, తాగు నీటి సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం చెన్నూరు పట్టణం కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఒలింపియా జిమ్‌ను వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
లబ్ధిదారుల సమస్యలు పరిష్కారిస్త..
మందమర్రిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలను పరిష్కారిస్తానని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మందమర్రిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో కరెంట్, తాగు నీటి సౌకర్యాలు లేవని బాధితులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే మంచిర్యాల అర్ అండ్ బీ డీఈ రమేశ్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఇండ్లకు కరెంటు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
తాగు నీటి సదుపాయం కల్పించాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుకు సూచించారు. అలాగే, ఆదివారం రాత్రి మందమర్రి మార్కెట్‌లోని ఆస్రా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అంతకు ముందు ఇఫ్తార్ విందులో ముస్లింలకు ఆయన వడ్డించారు.