- రేపు పరేడ్ గ్రౌండ్లో సింహ గర్జన సభ: వివేక్ వెంకటస్వామి
- ఆ వేదిక నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సమస్యలు వివరిస్తామని వెల్లడి
- రాష్ట్ర జనాభాలో మాది రెండోస్థానం
- తక్కువ ఉన్నారన్నది తప్పుడు ప్రచారమే
- కుల గణన లెక్కల్లో ఇది తేలుతుంది
- మేం ఏ కులాన్ని కించపర్చడం లేదు
- ఎవరి రిజర్వేషన్లను అడ్డుకోవట్లేదు
- తానెప్పుడూ పార్టీ లైన్లోనే పనిచేస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తమ జాతి ఆత్మగౌరవాన్ని, ఐక్యతను కాపాడేందుకు ఆదివారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో మాలల సంహిగర్జన సభ నిర్వహిస్తున్నామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింహ గర్జన సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మాలలు తరలిరానున్నారని, తమ జాతి సమస్యలను ఆ సభా వేదిక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడలోని తన నివాసంలో వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇతర కూలాల వారు సభలు పెట్టుకుంటే లేని తప్పు, తాము పెట్టుకుంటేనే ఎందుకని ప్రశ్నించారు. తాము సభ పెడుతున్నామని ప్రకటించినప్పటి నుంచి వివిధ వర్గాల వారు తమ జాతిపై, తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి వెంకటస్వామి చూపిన మార్గంలోనే తాను నడుస్తున్నానని, ఆనాడు తన తండ్రి ఏ కులం అని అడగకుండానే మాల అయినా, మాదిగ అయినా తమది ఒకటే జాతి అనే గొప్ప భావంతో సహాయం చేశారని వివరించారు. ఇప్పుడు తాను కూడా ఆయన బాటలోనే నడుస్తున్నానని స్పష్టం చేశారు.
సుప్రీం తీర్పుతో మాల జాతికి నష్టం..
రిజర్వేషన్లు అనేవి అస్పృశ్యతను, జాతి వివక్షను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినవని, కానీ సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341 కు విరుద్ధంగా ఉన్నదని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ తీర్పు వల్ల మాల, మాదిగలిద్దరికీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ మాల జాతి ఆత్మగౌరవం కాపాడేందుకు సభలు పెట్టానని, ఈ సందర్భంగా తాను ఏ జాతిపై విమర్శలు చేయలేదని తెలిపారు. తమ జాతిని ఐక్యంగా నిలపడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది మాలలు ఉన్నారని, రాష్ట్రంలోనే తమ జాతి జనాభా విషయంలో రెండో ప్లేస్లో ఉన్నదని చెప్పారు.
జాతి ఆత్మగౌరవం కోసం, తామంతా ఒక్కటే అనే ఐక్యతను చాటేందుకు మాలలంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. మాలల జనాభా తక్కువ ఉందనే ప్రచారం తప్పని పేర్కొన్నారు. కుల గణన లెక్కల్లో తమ జాతి జనాభా ఎంతో తెలుస్తుందని చెప్పారు. మాలలు దోచుకుంటున్నారని, ప్రభుత్వ పోస్టులన్నీ వారికే పోతున్నాయనేది తప్పుడు ప్రచారమని ఖండించారు. ఒకవేళ అదే నిజమైతే బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ కాకుండా పెద్ద సంఖ్యలో ఖాళీగానే ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు.
ఈ సభతో తాము ఎవరి రిజర్వేషన్లను అడ్డుకోవడం లేదని చెప్పారు. ఆగస్టు 1 న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రాబోయే రోజుల్లో ఉన్న రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. దళితులను విభజించే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా లేదని, వరుసగా 2 సార్లు రిజర్వేషన్లు పొందిన వారికి జీవితాంతం అవి దక్కాలని అన్నారు. వివక్షను వెనుకబాటుతో పోల్చొద్దని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు.
రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకం కాదు..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదని, తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, ఆ లైన్ లోనే పని చేస్తున్నానని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఆస్తులు కాపాడుకోవడం కోసం తాను రాజకీయాలు చేయడం లేదని, తన వ్యాపారాలన్నీ చట్టబద్ధంగానే నిర్వర్తిస్తున్నానని చెప్పారు. అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో తాను ఒకడినని గుర్తుచేశారు. మాలలను అడ్డుపెట్టుకొని దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు. మంచి పని కోసం పోరాటాలు చేసినప్పుడు విమర్శలు రావడం సహజమని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.