మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధ్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధ్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్రంలో కులగణన చేపట్టాలి 
  • మాలల రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని డిమాండ్

గోదావరిఖని/కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకోవడం సాధ్యమవుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వేర్వేరు సంఘాలు ఉంటే ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 30 లక్షల మంది మాలలు ఐక్యంగా ఉండాలని, నవంబర్ లో హైదరాబాద్​లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆదివారం గోదావరిఖని ఎన్టీపీసీ లక్ష్మీనర్సింహ గార్డెన్​లో ‘తెలంగాణ ఎంప్లాయీస్​అసోసియేషన్​ఆఫ్ మాల’ (టీమ్) ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ హాజరై మాట్లాడారు. కాకా వెంకటస్వామి ఎప్పుడూ మాలల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. ‘‘బ్రిటిషర్ల పాలనలో ఏపీలోని మాలలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు పొందారు. కానీ నిజాం పాలనలో ఉన్న తెలంగాణలోని మాలలు నిర్లక్ష్యానికి గురై ఉన్నత చదువులు చదవలేకపోయారు” అని అన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, మాలల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. 

మాలలపై దాడి జరుగుతున్నది: కేఆర్ నాగరాజు

మాలలపై భయంకరమైన దాడి జరుగుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ ​నాగరాజు అన్నారు. ‘‘ నాతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ట్రోలింగ్ నడుస్తున్నది. మందకృష్ణ, ఆర్ఎస్​ప్రవీణ్ కుమార్ సైతం మాలలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ప్రచారం చేశారు. మాల జాతి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుందని చెప్పాను తప్ప.. మిగతావారిని నేను కించపర్చలేదు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి. మాదిగలకు మాలలు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. తప్పుడు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేయొద్దు” అని కోరారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు.

సమతా సైనిక్​దళ్ స్టేట్ జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లే మాట్లాడుతూ.. మాలలు తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలన్నారు. 30 ఏండ్లుగా అబద్ధపు నాయకుల మధ్య నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్​అసోసియేషన్ ఆఫ్ మాల రాష్ట్ర అధ్యక్షుడు బద్దం డేనియల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లీడర్లు గుమ్మడి కుమారస్వామి, ముక్కా సుదర్శన్, దాసరి రాజు, కోడి సంజీవరావు, ఎం.లక్ష్మణ్, కె.వెంకటస్వామి, బి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఇందారంలో వివేక్ మార్నింగ్ వాక్..  

చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఆయన మార్నింగ్ వాక్  చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి తగినన్ని ఫండ్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయాలని ​జిల్లా కలెక్టర్​ను ఆదేశించినట్టు చెప్పారు.

విశాక ట్రస్ట్​ఆధ్వర్యంలో ఇందారంలో 20 బోర్​వెల్స్ వేసినట్టు గుర్తు చేశారు. డిసెంబర్ లో ఎస్సీ కాలనీలో బోర్ వేయిస్తానని, రోడ్డుతో పాటు ఎల్లమ్మ గుడి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కాగా, శ్మశానవాటిక కోసం భూమి కేటాయించాలని కుర్మపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. మందమర్రి విద్యానగర్​లోని ఖబరస్థాన్ 
చుట్టూ ప్రహరీ నిర్మించాలని ముస్లిం పెద్దలు విజ్ఞప్తి చేశారు.