తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దు : వివేక్ వెంకటస్వామి

  • మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: వివేక్‌‌ వెంకటస్వామి
  • పేదలకు సహకార సంఘాలు మరింత చేయూతనివ్వాలని సూచన 
  • సింగరేణి గెస్ట్‌‌ హౌస్‌‌లో మాలల సింహగర్జన సభ పోస్టర్ల ఆవిష్కరణ

కోల్​బెల్ట్, వెలుగు: దళారులను నమ్మి తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని మోసపోవద్దని రైతులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. చెన్నూరు టౌన్‌‌లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌‌తో కలిసి చెన్నూరు కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పత్తిని అమ్ముకోవాలని సూచించారు. పత్తిని రూ.7,521 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి మాత్రమే తీసుకుంటుందని, దానిని 16 క్వింటాళ్లకు పెంచాలని వివేక్‌‌ను రైతులు కోరగా, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వివేక్‌‌ వెంకటస్వామి, కలెక్టర్‌‌‌‌ను సన్మానించారు. 

పేదలకు మరింత సహకారం అందించాలి..

గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలను ఏర్పా టు చేసి, పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని వివేక్ అన్నారు. చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేసిన 71వ అఖిల భారత సహకార వారోత్సవాలకు ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్‌‌గా హాజరై, సహకార సంఘాల జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సహకార సంఘాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. సహకార సంఘాల్లో ములుకనూరు సంఘం చాలా మంచి సొసైటీగా పేరు తెచ్చుకుందని, దీని మాదిరిగానే చెన్నూరులో కూడా సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పేద ప్రజలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి చేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. ఏదైనా సహకారం కావాలంటే తన వంతు చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, కాకతీయ కో ఆపరేటివ్​ ట్రైనింగ్​ ఆఫీసర్​ యాకుబ్​, పీఏసీఎస్​ చైర్మన్​ చల్ల రాంరెడ్డి, అఖిలభారత సంఘటన సమితి సభ్యులు పొన్నాల యాదగిరి, రైతు సహకార సంఘాల సమాఖ్య సలహాదారు నైనాల గోవర్థన్,​ కార్యదర్శి శ్రీనికుడ లక్ష్మన్​ తదితరులు పాల్గొన్నారు. 

మాలల సింహగర్జనను సక్సెస్ చేయండి..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌‌లో డిసెంబర్‌‌‌‌1న నిర్వహించే మాలల సింహగర్జన సభను సక్సెస్​ చేయాలని వివేక్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్, చెన్నూరు, నస్పూర్ మండలాల్లో ఆయన పర్యటించారు. నస్పూర్‌‌‌‌లోని సింగరేణి గెస్ట్ హౌస్‌‌లో మంచిర్యాల జిల్లా మాలల సంఘం నాయకులతో కలిసి సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. జనాభా లెక్కల ప్రకారం మాలలు 30 లక్షల మంది ఉన్నారని, రాష్ట్ర జనాభాలో రెండో స్థానం మాలలదేనన్నారు. సింహగర్జన సభకు మాలలు భారీగా తరలివచ్చి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్‌‌ను సక్సెస్‌‌ చేసేందుకు ఎమ్మెల్యేలందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం లీడర్లు తొగరు సుధాకర్, జూపాక సుధీర్, కాసర్ల యాదగిరి, కూన రవికుమార్, సుదామల్ల హరికృష్ణ, పొట్ట మధుకర్, ముంతమాల పుల్లయ్య, ఎర్రం తిరుపతి, కాటం రాజేశం, చిప్పరి రాజమల్లయ్య, గజ్జెలి లక్ష్మణ్,​ కుంబాల రాజేశ్, మనోజ్, భూపెల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.