పోడు పట్టాల సమస్యపై సీఎంతో మాట్లాడతా : వివేక్​ వెంకటస్వామి

పోడు పట్టాల సమస్యపై సీఎంతో మాట్లాడతా : వివేక్​ వెంకటస్వామి
  • చెన్నూరులో 132కేవీ సబ్​స్టేషన్​కు కృషి
  • మున్సిపల్, ట్రాన్స్​కో, అటవీ శాఖ అధికారులతో రివ్యూ
  • బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 

కోల్​బెల్ట్, వెలుగు: పోడు పట్టాల సమస్య పరిష్కరించాలని సీఎం రేవంత్​రెడ్డిని కలిసి కోరనున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి తెలిపారు. సోమవారం చెన్నూరు క్యాంప్​ ఆఫీస్​లో మున్సిపల్, ట్రాన్స్​కో, ఫారెస్ట్​ ఆఫీసర్లతో రివ్యూ సమావేశాలు నిర్వహించారు. చెన్నూరు ప్రాంతంలోని అటవీ భూముల్లో ఎన్నో ఏండ్ల నుంచి పోడు సేద్యం చేసుకుంటున్న చాలా మందికి పట్టాలు లేవని, వారు పడుతున్న ఇబ్బందులను మంగళవారం సీఎం రేవంత్​రెడ్డిని కలిసి వివరిస్తానన్నారు. అందరికీ పట్టాలు ఇప్పించడం, ఇతర సమస్యలపై సీఎంకు  విన్నవిస్తానని చెప్పారు.

 చెన్నూర్​లో విద్యుత్ వినియోగం పెరిగిపోయి ప్రస్తుతమున్న సబ్​స్టేషన్ల కెపాసిటీ సరిపోపోవడం లేదని, అందుకే పవర్ ​సప్లైలో సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోతోందన్నారు. 5 మెగావాట్ల సబ్​స్టేషన్​ను శివ్వారం గ్రామంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో పవర్ ​సప్లైలో అంతరాయాలు కలగకుండా 132 కేవీ సబ్​స్టేషన్​ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సబ్​స్టేషన్ ​ఏర్పాటు కోసం ఇప్పటికే సెక్రటరీ ఎనర్జీ, ట్రాన్స్​కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. 

నియోజకవర్గంలో మిషన్ భగీరథ స్కీం అస్తవ్యస్తంగా తయారైందని, చాలా చోట్ల నీరు సరఫరా కావడంలేదన్నారు. పాత పైప్​లు వేశారని, ఇది ఓ ఫెయిల్డ్​స్కీం అని ఫైర్ ​అయారు. పైప్ లైన్లన్నీ బాగుచేసి నీటి సరఫరా చేయాలని అధికారులకు ఇప్పటికే  ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి శివ్​అశీష్​ సింగ్, ఎఫ్​డీవో రమేశ్, ఏడీఈ , మున్సిపల్​ కమిషనర్​ గంగాధర్, అటవీ, ట్రాన్స్​కో, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు. 

త్యాగానికి ప్రతీక బక్రీద్

త్యాగాలకు గుర్తుగా ముస్లింలు బక్రీద్​ పండుగను జరుపుకుంటారని వివేక్​ వెంకటస్వామి అన్నారు. బక్రీద్​ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలతో కలిసి మందమర్రి సీఈఆర్​ క్లబ్​సమీపంలోని ఈద్గా వద్ద వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మందమర్రి, జైపూర్, చెన్నూర్​లోని ముస్లింల ఇండ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. వారితో కలిసి సేమియా సేవించారు. ఖురాన్​లో చెప్పిన విధంగా పేద ప్రజలకు సాయం అందించేందుకు ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలన్నారు.

వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో పూజలు

జైపూర్ మండలం ఇందారంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో  ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తీర్థప్రసాదాలు అందజేశారు. వేణుగోపాలస్వామి ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా, తన కుమారుడు వంశీకృష్ణ ఎంపీగా గెలిచామన్నారు. తమ గెలుపు కోసం అర్చకులు, కాంగ్రెస్​ శ్రేణులు పూజలు చేశారన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరు బస్టాండ్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన సుజల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.