- అన్ని రకాలుగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- నియోజకవర్గంలోరూ. 70 కోట్లతో పనులు స్టార్ట్
- త్వరలోనే మరో రూ. 80 కోట్లు శాంక్షన్
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
కోల్ బెల్ట్/జైపూర్/కోటపల్లి, వెలుగు: చెన్నూరును రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. చెన్నూరులో ప్రస్తుతం రూ.70 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలో డీఎంఎఫ్టీ, సీఎస్సార్ కింద మరో రూ.80 కోట్లను మంజూరు చేయిస్తానని చెప్పారు. రూ.10 కోట్లతో చెన్నూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైయినేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. భీమారం మండలంలో రూ.2 కోట్ల పనులు నడుస్తున్నాయని, త్వరలో మరో రూ.2 కోట్లు శాంక్షన్ చేయిస్తానన్నారు. రూ.1.40 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందని, తర్వలోనే 108 అంబులెన్స్ మంజూరు అవుతుందన్నారు.
చెన్నూరులో 100 బెడ్లతో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కోరతానని చెప్పారు. ఇప్పటికే సీఎంను ఒప్పించి, సోమనపల్లిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించానన్నారు. చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ఇంటింటికి తాగునీటి సప్లై కోసం రూ.100 కోట్లతో అమృత్ 2.0 స్కీం పనులు కూడా స్టార్ట్ అయ్యాయన్నారు. టేకుమట్లలో రూ.17 లక్షల డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, గ్రామం నుంచి గోదావరి నదికి వెళ్లేందుకు ఈజీఎస్ కింద రోడ్డు వేయిస్తానని వివేక్ హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని, దీనిపై రివ్యూ మీటింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను కోరారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే వాటిని పంపిణీ చేస్తారన్నారు.
అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నం..
నిజామాబాద్, జగదల్పూర్ నేషనల్ హైవే అభివృద్ధి, రిపేర్లను గత బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోకపోవడంతో రోడ్డంతా ఆధ్వానంగా మారిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. నేషనల్ హైవేలోని జోడువాగుల వద్ద కొత్తగా ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం, విస్తరణ కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తాను కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి రూ.100 కోట్ల ఫండ్స్ మంజూరు చేయించామన్నారు. టెక్నికల్ సమస్యతో ఇంకా టెండర్ ప్రక్రియ కాలేదని, త్వరలోనే రోడ్డు పనులు స్టార్ట్ అవుతాయన్నారు. టేకుమట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం, రూ.1.80 కోట్లతో జోడువాగుల వద్ద రోడ్డు రిపేర్ల పనులను మంగళవారం ప్రారంభించామన్నారు. అలాగే బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.16 కోట్లను పంచాయతీరాజ్ శాఖ మత్రి సీతక్క మంజూరు చేయనున్నారని తెలిపారు. భీమారంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపన్ పల్లి, దేవులవాడ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ గ్రామాల్లో రూ.68 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తాను నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే.. కొందరికి సోషల్ మీడియాలో ఇష్టారీతిగా రాయడం షోకుగా మారిందన్నారు.
బాధిత కుటుంబానికి పరిహారం..
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ కోసం తవ్విన గుంతలో అక్టోబర్ 6న ప్రమాదవశాత్తు పడి మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్టూడెంట్ చిప్పకుర్తి రాజ్‌కుమార్ చనిపోవడం కలిచివేసిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ విషయాన్ని గ్రామ కాంగ్రెస్ లీడర్లు తన దృష్టికి తీసుకురాగా సింగరేణి యాజమాన్యం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించానన్నారు. బాధిత కుటుంబానికి రూ. 15 లక్షల చెక్కును మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి వివేక్ అందజేశారు. ఆ కుంటుంబంలో ఒకరికి త్వరలో ఔట్ సోర్సింగ్ జాబ్ కూడా ఇస్తామన్నారు. కాగా, చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొని వివిధ శాఖల ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
జనవరిలోనే ఇండ్లు, రైతు భరోసా
గత బీఆర్ఎస్ సర్కార్ రూ.3 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిందని, వాస్తవంగా రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ఖజానా ఖాళీ చేసిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని పక్కాగా అమలు చేశారన్నారు. మహిళల ఫ్రీ బస్సు కోసం నెలకు రూ.300 కోట్లను సర్కార్ ఆర్టీసీకి చెల్లిస్తోందని, ఈ ఏడాది ఆర్టీసీ ఖాతాలో రూ.4 వేల కోట్లను జమ చేసిందన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. త్వరలో డిజిటల్ కార్డులు ఇస్తారని, జనవరిలో నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తారని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అమలు చేస్తారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.450 కోట్లు మాత్రమే శాంక్షన్ చేసిందని.. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే రూ.630 కోట్లు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.