ఎన్నికల తర్వాత సింగరేణిలో ఇండ్ల పట్టాలు : వివేక్ వెంకటస్వామి

  • నియోజకవర్గంలో రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీ ఏర్పాటుకు ప్రయారిటీ: వివేక్ వెంకటస్వామి
  • వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఎక్కువ ఫండ్స్ అడగొచ్చు
  • ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే విజన్ ఉన్న లీడర్‌‌‌‌ వంశీ 
  • క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తామని వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు జీవో 76 ప్రకారం త్వరలో పట్టాలు ఇస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను ఎంపీగా ఉన్న టైమ్‌‌లో క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయిస్తే.. పదేండ్లలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పూర్తి చేయించలేకపోయారని మండిపడ్డారు. 3 నెలల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అలాగే, పరిహారం అందని నిర్వాసితులకు పరిహారం వచ్చేలా చేస్తామని చెప్పారు. 

నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్‌‌ చాలా ఉన్నాయని, ఇందులో భాగంగా గద్దెరాగడిలో రూ.70 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీల ఏర్పాటుకు ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని పార్టీ ఆఫీస్‌‌లో నిర్వహించిన మేడే వేడుకల్లో వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తుచేశారు. సింగరేణి, అసంఘటిత కార్మికులకు, ఐఎన్టీయూసీ నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. 

సింగరేణి రిటైర్ కార్మికులను వివేక్‌‌ శాలువా కప్పి సన్మానించారు. కాకా వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని వివేక్‌‌ అన్నారు. బొగ్గు గని కార్మికులకు, ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో పెన్షన్ విధానం తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. పెన్షన్ ఇవ్వడం వల్ల తమకు నష్టం జరుగుతుందని పరిశ్రమల యాజమాన్యాలు అభ్యంతరం చెబితే.. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని చెప్పి వారి సంక్షేమం కోసం పెన్షన్ విధానం అమలు చేయించారని తెలిపారు.

 కార్మిక సంఘం లీడర్లను ప్రోత్సహించేందుకు 1981లో కార్మిక బంధు అవార్డు ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. కార్మికుల తరఫున కొట్లాడేందుకు యూనియన్‌‌ను స్థాపించారన్నారు. కార్మికులను మంచిగా చూసుకున్నప్పుడే ఉత్పత్తి బాగా వస్తుందని నమ్మిన వ్యక్తి కాకా అని పేర్కొన్నారు. 

కేసీఆర్ అవినీతిపై పోరాడితే ఫ్యాక్టరీ మూసివేయించిండు..

కేసీఆర్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేశానని తనపై కక్ష కట్టి పటాన్‌‌చెరులోని తమ ఫ్యాక్టరీని మూసివేయించారని వివేక్‌‌ ఆరోపించారు. అయితే, అందులో పనిచేసిన కార్మికులకు అన్ని బెనిఫిట్స్‌‌ చెల్లించి గౌరవంగా పంపించామని తెలిపారు. 

ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వంశీ..

తన జీవితాంతం ప్రజలకు సేవ చేసిన కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని వివేక్ అన్నారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్‌‌ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే విజన్ వంశీకి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్​రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్, బ్లాక్ అధ్యక్షులు పల్లె రాజు, గోపతి రాజయ్య, నేతలు ఎండీ.అబ్దుల్ అజీజ్, ఓడ్నాల శ్రీనివాస్, పుల్లూరి కళ్యాణ్, కనకరాజు, ఐఎన్టీయూసీ లీడర్లు రాంబాబు, ఎల్లయ్య పాల్గొన్నారు. 

వంశీకృష్ణ గెలుపు కోసం కష్టపడాలి: బండ్ల గణేశ్‌‌​ 

కాటారం, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పార్టీ నేత, సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్‌‌ పిలుపునిచ్చారు. బుధవారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బండ్ల గణేశ్‌‌ మాట్లాడారు. మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత శ్రీధర్ బాబు అని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌‌చార్జిగా వంశీకృష్ణ గెలుపుకై అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.