రామరాజ్యం స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు: ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన రామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్, -సరోజ దంపతులు పాల్గొన్నారు. ఆయా చోట్ల కల్యాణ వేడుకల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాక్షస పాలనను ప్రజలు అంతం చేశారన్నారు. రామరాజ్యం స్ఫూర్తిగా  సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.  

క్యాథనపల్లి మున్సిపాలిటీలోని శ్రీ రామ మంజునాథ్, మందమర్రి మండలం పులిమడుగు, మారుతి నగర్, యాపల్, పాలచెట్టు పంచముఖ ఆంజనేయ స్వామి, శేష పల్లి, రామకృష్ణాపుర్, జైపూర్, భీమారం మండల కేంద్రాల్లోని  హనుమాన్ టెంపుల్స్, సుద్దాల, ఆసనాధ్, శంకరారపురం, మల్లంపేట గ్రామాల్లో జరిగిన కల్యాణ వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో  క్యాథనపల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ ఛైర్మన్ సాగర్ రెడ్డి, మూల రాజి రెడ్డి పాల్గొన్నారు.